
మమతా బెనర్జీ మొండితనం ప్రజాస్వామ్యానికే అవమానం: ఎన్. రామచందర్ రావు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీరుపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె చర్యలు ప్రజా తీర్పును అవమానించడమే కాకుండా, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచేలా ఉన్నాయని బుధవారం ఆయన విమర్శించారు.
మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు, రాజ్యాంగ నియమాలను మమతా బెనర్జీ కాలరాస్తున్నారని ఆరోపించారు. మమతా దీదీ రాజీనామా చేయనని అనడం ప్రజల తీర్పును అవమానించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే. అలాగే ఆర్టికల్ 164 ప్రకారం మెజారిటీ ఉన్న పార్టీ నేతను ముఖ్యమంత్రిగా నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవించి, ఇప్పుడు అదే పదవిని ఆమె కించపరుస్తున్నారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని ఆమె హుందాగా అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
నిరంకుశత్వానికి నిదర్శనం: సి.ఆర్. కేశవన్
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ కూడా మమత వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఆమెలోని నిరంకుశ మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయని, గత 15 ఏళ్ల ఆమె అరాచక పాలన వల్లే బెంగాల్ ప్రజలు ఆమెను అధికారం నుంచి దూరం చేశారని కేశవన్ ఎద్దేవా చేశారు. మే 7తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుందని, ఆ తర్వాత ఆమెకు పదవిలో కొనసాగే ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కు లేదని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు, మంగళవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టాయని ఆరోపించారు. తాము అధికారికంగా ఓడిపోయినట్లు కనిపించినా, నైతికంగా విజేతలం మేమేనని, అందుకే లోక్ భవన్‌కు వెళ్లి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మమత తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.
