
మమతా బెనర్జీ ఓటమి ఖాయం: ఎన్. రామచందర్ రావు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు తీవ్ర నిరాశ, ఆందోళనల్లో ఉన్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోబోతోందని, అందుకే ఈసీ, ఈవీఎంలపై ఆ పార్టీ నేతలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బెంగాల్‌లో ప్రభుత్వ మార్పును స్పష్టంగా సూచిస్తున్నాయి. మమతా దీదీ ఓటమి ఖాయమని అర్థమయ్యాక, టీఎంసీ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల మోహరింపును వ్యతిరేకిస్తున్న టీఎంసీ తీరును ఆయన తప్పుబట్టారు. ఒకవైపు కేంద్ర బలగాలను చూసి ప్రజలు భయపడుతున్నారని టీఎంసీ నేతలు అంటున్నారు. కానీ వాస్తవానికి కేంద్ర బలగాలు ఉండటం వల్లే ప్రజలు భయం లేకుండా బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారు అని ఆయన పేర్కొన్నారు. గతంలో బెంగాల్‌లో ఎన్నికలంటేనే హింస, ప్రత్యర్థులపై దాడులు ఉండేవని, కానీ ఈసారి కేంద్ర బలగాల కారణంగా హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని ఆయన వివరించారు. రాష్ట్ర పోలీసుల ద్వారా విపక్షాలను అణిచివేసేందుకు టీఎంసీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.
రీపోలింగ్ నిర్ణయం
ఇక ఇటీవల ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌లో తీవ్రమైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగినట్లు గుర్తించిన నేపథ్యంలో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. అలాగే పశ్చిమ మఘరహాట్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని 15 బూత్‌లలో కూడా రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ మే 21న నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ ను కలిసింది. మరోవైపు టీఎంసీ నేత కునాల్ ఘోష్ నేతృత్వంలో కొందరు నెటాజీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించారు. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వాదనలు మరింత వేడెక్కుతున్నాయి.
