

నలగంపల్లి 'నెట్ జీరో' గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దండి: సీఎం చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో 'నెట్ జీరో' విధానాలను విజయవంతంగా అమలు చేస్తున్న నలగంపల్లి గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువులను అంతే మొత్తంలో నియంత్రించడాన్ని నెట్ జీరో అంటారు.
కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండవ రోజైన శనివారం ఆయన నలగంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెట్ జీరో విధానాన్ని పాటిస్తున్న పలు ఇళ్లను సీఎం సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇళ్లలో అమర్చిన సోలార్ రూఫ్‌టాప్, సోలార్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వాన నీటి సంరక్షణ పద్ధతులు, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ (మిద్దె తోటలు) వంటి పర్యావరణహిత విధానాలను పరిశీలించి అభినందించారు.
నలగంపల్లి నమూనాను ఒక ‘కేస్ స్టడీ’గా తీసుకుని, ఈ నెట్ జీరో కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గం అంతటా విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా భాగం చేయాలని సూచించారు. కుప్పంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ విస్తరణ ద్వారా నియోజకవర్గంలోని 7,489 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, 39,215 మంది బీసీ కుటుంబాలు, 7,381 మంది ఓసీ కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి లబ్ధి చేకూరనుందని అధికారులు సీఎంకు వివరించారు.
అనంతరం సీఎం కుప్పం ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు. ఆసుపత్రిలో పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ ‘సంజీవని’ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సంజీవని ద్వారా కుప్పం ప్రజలకు చేకూరిన లబ్ధిపై సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
చివరగా, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
