
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇటీవల ప్రారంభించిన ప్లాంట్ యొక్క మూడవ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ నుంచి దట్టమైన నల్లటి పొగలు పైకి లేవడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మిర్యాలగూడ నుంచి ఒక ఫైర్ ఇంజన్‌తో పాటు, ప్లాంట్ అంతర్గత భద్రతా విభాగానికి చెందిన మరో ఐదు ఫైర్ టెండర్లు (మొత్తం 6 ఫైర్ ఇంజన్లు) మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని అధికారులు ధృవీకరించారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రాథమిక అంచనా ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు మిర్యాలగూడ అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్‌లోని కేబుళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం ఎంత అనేదానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
