Let's talk: editor@tmv.in
అప్పర్ సిలేరుకు మహర్దశ..1,350 మెగావాట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు

అప్పర్ సిలేరుకు మహర్దశ..1,350 మెగావాట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

రాష్ట్ర విద్యుత్ రంగంలో దశాబ్దాల చరిత్ర కలిగిన అప్పర్ సిలేరు జలవిద్యుత్ కేంద్రం సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం నీటి ప్రవాహంపై ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ కేంద్రాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1,350 మెగావాట్ల భారీ 'పంప్డ్ స్టోరేజ్' ప్రాజెక్టుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా 2029 నాటికి ఈ విస్తరణ పనులను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

తొమ్మిది యూనిట్లు.. 1,350 మెగావాట్లు

ప్రస్తుతం అప్పర్ సిలేరు ప్రాజెక్టు 240 మెగావాట్ల సామర్థ్యంతో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుతూ ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 రివర్సిబుల్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు అవసరమైనప్పుడు నీటిని దిగువ నుంచి ఎగువకు పంప్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

రాష్ట్రానికి భారీ గ్రిడ్ బ్యాటరీ

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఆధునిక విద్యుత్ గ్రిడ్ నిర్వహణలో అత్యంత కీలకం. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ద్వారా పగటిపూట అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్న సమయంలో ఆ అదనపు విద్యుత్‌ను ఉపయోగించి దిగువ జలాశయం నుంచి నీటిని ఎగువ జలాశయానికి పంప్ చేస్తారు. తిరిగి రాత్రి వేళల్లో లేదా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో పైనున్న నీటిని కిందకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల విద్యుత్ వృధా కాకుండా ఉండటమే కాక గ్రిడ్ సమతుల్యత దెబ్బతినకుండా ఒక భారీ రీఛార్జబుల్ బ్యాటరీలా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది.

ఆరు దశాబ్దాల విశ్వసనీయత

సిలేరు నదిపై గుంటవాడ వద్ద నిర్మించిన వీర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు సుమారు 60 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలందిస్తోంది. 1967-68లో మొదటి దశలో రెండు 60 మెగావాట్ల యూనిట్లు విదేశీ సాంకేతికతతో ప్రారంభం కాగా 1994-95లో రెండో దశలో బీహెచ్ఈఎల్ సహకారంతో మరో రెండు యూనిట్లు జతయ్యాయి. సాధారణంగా జలవిద్యుత్ కేంద్రాల జీవితకాలం 35 ఏళ్లుగా భావిస్తారు. అయితే ఎప్పటికప్పుడు చేపట్టిన రీనోవేషన్, మోడర్నైజేషన్ పనుల వల్ల ఈ ప్రాజెక్టు నేటికీ ఏటా 575 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ తన సామర్థ్యాన్ని చాటుకుంటోంది.

దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైన ఇంధనంపై దృష్టి సారిస్తున్న తరుణంలో, అప్పర్ సిలేరు విస్తరణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనుంది. తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ నిల్వ సాంకేతికతలో పంప్డ్ స్టోరేజ్ అత్యంత సమర్థవంతమైనదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పీక్ లోడ్ సమయాల్లో విద్యుత్ కోతలు లేని సరఫరాకు మార్గం సుగమమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.