
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికలు.. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం
మహారాష్ట్ర శాసన మండలి నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనున్నప్పటికీ, ప్రధాన రాజకీయ కూటములు ఇంకా తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించలేదు.. ఠాక్రేతో పాటు శాసన మండలికి చెందిన తొమ్మిది మంది సభ్యులు మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీల కోసం మే 12న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ మే 13 నాటికి పూర్తికానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఏప్రిల్ 30 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంది. ఇప్పటికే బీజేపీ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించగా, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే), ఎన్‌సిపి(అజిత్‌పవార్) మాత్రం మిగిలిన స్థానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నుంచి సునీల్ వినాయక్ కర్జాత్కర్, మాధవి నాయక్ , సంజయ్ నత్తూజీ భెండే,వివేక్ బిపిందాదా కొల్హే ,ప్రమోద్ శాంతారం జాథర్‌లు ఉన్నారు.
శివసేన (యూబీటీ) అభ్యర్థిగా అంబాదాస్ దాన్వే
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, శివసేన (యూబీటీ) తమ అభ్యర్థిగా మాజీ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వేను ప్రకటించింది. దీంతో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్వయంగా పోటీ చేసే అవకాశాలు ముగిశాయి. ఈ విషయాన్ని పార్టీ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే మీడియాకు వెల్లడించారు. ఉద్ధవ్ సాహెబ్ నిర్ణయం మేరకు అంబాదాస్ దాన్వేనే మా అభ్యర్థి అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కు మొత్తం తొమ్మిది స్థానాల్లో ఒక స్థానంలో మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ఈ ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది. చత్రపతి సంభాజీనగర్‌కు చెందిన అంబాదాస్ దాన్వే, 2022 నుంచి 2025 వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇక ఉద్ధవ్ థాకరే శాసన మండలి సభ్యునిగా ఉన్న పదవీకాలం మే 12తో ముగియనుంది.
శివసేన షిండే.. చివరి వరకు ఉత్కంఠే
మరోవైపు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఇటీవల ఎన్నికల్లో అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషం వరకు గోప్యత పాటించడం ద్వారా అంతర్గత ఒత్తిళ్లను నివారించాలన్నదే ఈ వ్యూహం వెనుక కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా నామినేషన్ గడువు ముగియడానికి గంట ముందు శివసేన జ్యోతి వాఘ్మారేను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక కాంగ్రెస్ మాజీ నేత ప్రజ్ఞా సాతవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక స్థానానికి మే 12న ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీలో చేరిన సాతవ్‌కు ఆ పార్టీ తిరిగి అభ్యర్థిత్వం ఇచ్చింది. ఆమె పదవీకాలం అసలు 2030 జూలై 27 వరకు ఉండింది. మొత్తంగా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం రాజకీయంగా ఆసక్తికర పరిస్థితులను సృష్టిస్తూ, ఎన్నికల ముందు చివరి నిమిషం వ్యూహాలకు వేదికగా మారుతోంది.
