Let's talk: editor@tmv.in
వర్చువల్‌ పద్ధతిలో మహానాడు-2026: మంత్రి అచ్చెన్నాయుడు

వర్చువల్‌ పద్ధతిలో మహానాడు-2026: మంత్రి అచ్చెన్నాయుడు

Panthagani Anusha
19 మే, 2026

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ "మహానాడు-2026"ను ఈసారి వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. పార్టీలో పొదుపు చర్యలను అమలు చేయాలనే ఉద్దేశంతో.. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది పసుపు పండుగను సరికొత్త సాంకేతికతతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు ఈ డిజిటల్ మహానాడు వేడుకలు జరగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం 'ఎన్టీఆర్ భవన్' దీనికి ప్రధాన వేదికగా నిలవనుంది. ఎన్టీఆర్ భవన్ నుంచే ప్రత్యేక స్టేజీని ఏర్పాటు చేసి మహానాడు ఆన్‌లైన్ కార్యక్రమాలను పార్టీ తీర్మానాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేయనున్నారు.

అయితే మహానాడు వేడుకలకు కేడర్, క్షేత్రస్థాయి నాయకులు దూరం కాకుండా ఉండేందుకు అధిష్టానం పక్కా ఏర్పాట్లు చేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,845 క్లస్టర్లలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు అంతా ఒకచోట చేరి వీక్షించేలా పెద్ద డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

నాయకత్వం, క్యాడర్ ఎక్కడ ఉన్నప్పటికీ సాంకేతికత ద్వారా అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే అద్భుతమైన అవకాశం ఈ డిజిటల్ మహానాడు అని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ డిజిటల్ మహానాడులో భాగస్వాములు కావాలని ఈ పసుపు పండుగను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.