Let's talk: editor@tmv.in
పోక్సో కేసులో బండి భాగీరథ్‌పై లుక్‌ఔట్ సర్క్యులర్

పోక్సో కేసులో బండి భాగీరథ్‌పై లుక్‌ఔట్ సర్క్యులర్

Panthagani Anusha
17 మే, 2026

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భాగీరథ్‌పై నమోదైన పోక్సో ( పోక్సో) కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగీరథ్ దేశం విడిచి పారిపోకుండా సైబరాబాద్ పోలీసులు లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. కాగా ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగానూ పెను దుమారం రేపుతోంది. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా సాగాలంటే కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కే కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి కుటుంబ సభ్యుడిపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ఆయన పదవిలో ఉంటే స్వేచ్ఛాయుత దర్యాప్తుకు అడ్డంకులు తలెత్తే అవకాశముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇటు న్యాయస్థానంలోనూ భాగీరథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాత్రి అత్యవసర విచారణ జరిపింది. అయితే ఈ దశలో అరెస్టు నుంచి ఎలాంటి మధ్యంతర రక్షణ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని భాగీరథ్ తరపున న్యాయవాది కోరినప్పటికీ కోర్టు అందుకు నిరాకరించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే గత మే 8వ తేదీన 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు బండి భాగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత తో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు బాలికతో సంబంధం కొనసాగిస్తూ భాగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాధిత బాలిక నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కేసులో మరికొన్ని కఠినమైన పోక్సో సెక్షన్లను చేర్చారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను భాగీరథ్ పూర్తిగా ఖండించారు. ఇదంతా తనను అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన కుట్రగా పేర్కొంటూ ఆయన పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. తనకు పరిచయమైన యువతి కుటుంబ సభ్యులు కుటుంబ కార్యక్రమాలకు స్నేహితుల సమావేశాలకు తనను ఆహ్వానించేవారని వారిని నమ్మి కొన్ని పుణ్యక్షేత్రాలకు కూడా కలిసి వెళ్లినట్లు భాగీరథ్ తెలిపారు. ఆ తర్వాత సదరు యువతిని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని తాను నిరాకరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు.

కాగా వారి బెదిరింపులకు భయపడి గతంలో యువతి తండ్రికి రూ. 50 వేలు ఇచ్చానని ఆ తర్వాత ఏకంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని భాగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంత మొత్తం ఇవ్వకపోతే యువతి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని కూడా బ్లాక్‌మెయిల్ చేశారని ఆయన వివరించారు. ప్రస్తుతం పరస్పర ఆరోపణలతో కూడిన ఈ రెండు ఫిర్యాదులపై సైబరాబాద్ పోలీసులు అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు