Let's talk: editor@tmv.in
“తమిళనాడు రాజకీయాలను”చూస్తే అసూయ కలుగుతోంది..పవన్ కళ్యాణ్

“తమిళనాడు రాజకీయాలను”చూస్తే అసూయ కలుగుతోంది..పవన్ కళ్యాణ్

Panthagani Anusha
27 మే, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని రాజకీయ శక్తులు చాలా తక్కువ సమయంలోనే విశేష విజయాలను సాధించడం చూస్తుంటే తనకు కూడా కొంత అసూయ కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 12 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని నిర్మించుకున్నానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇంత సుదీర్ఘ పోరాటం చేసినా తనకు దక్కిన విజయాలు ఒక ఎత్తయితే మరికొన్ని పార్టీలు చాలా వేగంగా సులభంగా దూసుకుపోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. “నేను రోడ్లపై పోరాటాలు చేస్తూ ఎన్నో సంవత్సరాలు గడిపాను. కానీ కొందరు కేవలం కట్‌ఔట్లతోనే ప్రజల్లో తిరుగులేని గుర్తింపు సంపాదించి ముందుకు వచ్చేస్తున్నారు. అది చూసినప్పుడు నాకూ కొంత అసూయ కలుగుతోంది అని పవన్ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని, అక్కడ కొన్ని శక్తులు చాలా సాఫీగా ప్రజల్లో స్థానం సంపాదించుకున్నాయని పవన్ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ... తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగస్టు 14 నాటికి సంస్థాగత కమిటీలు

ఇదే వేదికపై నుంచి పార్టీ సంస్థాగత బలోపేతంపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన కమిటీల నియామకాలను పూర్తి పారదర్శకంగా ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీలు స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

కార్యకర్తలకు గుర్తింపు.. 25 పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు

పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడుతున్న సాధకులు, యాక్టివ్ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న నాయకులు, కట్టుబడి పనిచేసే కార్యకర్తలను గుర్తించేందుకు పార్లమెంటు స్థాయి ఎంపిక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. పంచాయతీ స్థాయి నుంచి పార్టీ బలాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు సుమారు 25 పార్లమెంటరీ కమిటీలు పనిచేస్తాయని వివరించారు. అదేవిధంగా పార్టీ తరపున మీడియాలో అధికారికంగా ఎవరు మాట్లాడాలనే అంశంపై స్పష్టమైన విధివిధానాలు తీసుకొస్తామని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతీకార రాజకీయాలు నా నైజం కాదు

రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు, ప్రతీకార రాజకీయాలు చేయడం తన సిద్ధాంతం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “ప్రత్యర్థి పార్టీల నాయకులు చట్టపరమైన ఇబ్బందుల్లో పడటమే మన రాజకీయ ఎదుగుదలకు మార్గం అని నేను భావించను. సోషల్ మీడియా వేదికగా విభేదాలు సృష్టించేలా, వ్యక్తిగత దూషణలకు దిగే ప్రచారాలను జనసేన ఎప్పటికీ సహించదు” అని తేల్చి చెప్పారు. ఢిల్లీ పర్యటనల్లో జాతీయ నాయకులతో తాను జరిపే సమావేశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నిధుల సాధన కోసమే తప్ప... ఎవరినో రాజకీయంగా దెబ్బతీయడానికి కాదన్నారు. ప్రజా జీవితంలో వ్యక్తిగత హోదా, గుర్తింపు కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారమే తనకు అత్యంత సంతృప్తిని ఇస్తాయని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.