
బండి భగీరథ్‌పై 'లుక్ అవుట్' నోటీసులు జారీ చేయాలి: కవిత
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై వెంటనే 'లుక్ అవుట్ నోటీసులు' జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ కేసు విచారణలో పారదర్శకతపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఈ చర్య తప్పనిసరి అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉందని విమర్శించారు. అందువల్ల భగీరథ్ కూడా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులపై భగీరథ్ ఎదురు దాడికి దిగుతూ పెట్టిన కేసుల్లో వాస్తవాలు కోర్టు తీర్పు తర్వాత బయటపడతాయని ఆమె అన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్ల బాధిత మైనర్ బాలిక ఫోటోలు బయటకు రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు లీక్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. మైనర్ బాలిక కేసుల్లో అత్యంత జాగ్రత్త అవసరమని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, బండి సంజయ్ ప్రధాని, సీఎం ఉన్న వేదికను పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించారు.
మహిళల భద్రత, సాగునీటి హక్కులే మా నినాదం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో నేడు రాజకీయ శూన్యత ఏర్పడిందని, దానిని భర్తీ చేసేందుకే తమ పార్టీ పుట్టిందని ఆమె అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఆమె ఎండగట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం కోసం పడుతున్న శ్రమను చూసైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని, పాలమూరు ప్రాజెక్టుపై ప్రధానికి లేఖ రాయాలని సూచించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే 'వాటర్ కమిషన్' ఏర్పాటు చేసి, ప్రతి 3 వేల ఎకరాలకు ఒక 'లష్కర్'ను నియమిస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సందర్భంలో, ప్రస్తుతం జరుగుతున్న గణనలో కుల, ఉపకుల, ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని సేకరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు, జనగణనలో సామాజిక–ఆర్థిక డేటా సేకరణపై కూడా కవిత పలు డిమాండ్లు చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నీట్ పేపర్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని ఆరోపించారు. ఇక తెలంగాణ రక్షణ సేన ఏర్పాటుతో రాష్ట్రంలో రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు ‘జెండా పండుగ’ నిర్వహిస్తామని, పార్టీ నిర్మాణానికి ఇది పునాది అవుతుందని వెల్లడించారు.
