Let's talk: editor@tmv.in
దక్షిణాది ప్రాతినిధ్యంపై లోకేష్ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి: వై.ఎస్. షర్మిల

దక్షిణాది ప్రాతినిధ్యంపై లోకేష్ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి: వై.ఎస్. షర్మిల

Panthagani Anusha
23 మే, 2026

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రంగా ఖండించారు. లోకేష్ ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లో లేని గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనాభాను అదుపులో ఉంచి, మానవాభివృద్ధి సూచీల్లో దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇవ్వాల్సింది పోయి రాజకీయంగా శిక్ష వేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. సరైన చట్టపరమైన రాజ్యాంగపరమైన రక్షణలు లేకుండా కేంద్రం ముందడుగు వేస్తున్న ఈ డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

కేవలం ఎంపీ సీట్ల సంఖ్య పెరగడం వల్లే దక్షిణాది రాష్ట్రాలకు రక్షణ లభిస్తుందనుకోవడం భ్రమ అని షర్మిల పేర్కొన్నారు. అసలు సమస్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లభించే “సాపేక్ష ప్రాతినిధ్యం”, దేశ రాజకీయాలను శాసించే “రాజకీయ ప్రభావం” గురించినదని గుర్తుచేశారు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు సంఖ్యాపరంగా కొన్ని సీట్లు పెరగొచ్చు కానీ అదే సమయంలో జనాభా విపరీతంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది రాష్ట్రాల హవానే నడుస్తుందని జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన మన దక్షిణాది రాష్ట్రాల మాటకు విలువ, ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం సీట్ల సంఖ్యను పెంచడంపైనే మొండిగా ముందుకు వెళ్తోందని కానీ రాజ్యాంగ నిపుణులు సూచించిన ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య నమూనాలను పూర్తిగా తొక్కిపెట్టిందని షర్మిల విమర్శించారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, పరిపాలనా అధికారులు బదిలీ చేయడం అధికార వికేంద్రీకరణ వంటి ముఖ్యాంశాలను కేంద్రం అస్సలు పరిశీలించడం లేదన్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశ దినాలు గణనీయంగా తగ్గిపోయాయని జాతీయ చర్చల్లో దక్షిణాది రాష్ట్రాల స్వరం ఇప్పటికే పక్కన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో సమాఖ్య సమతౌల్యాన్ని కాపాడకుండా లోక్‌సభను విస్తరిస్తే సామాన్యుడి గొంతుకైన వ్యక్తిగత ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో సార్థక చర్చలు మరింత బలహీనపడతాయని హెచ్చరించారు.

అయితే ఒకప్పుడు రాష్ట్రాల హక్కుల కోసం ప్రాంతీయ ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కనీస రక్షణలు కూడా కోరకుండా బీజేపీ వైఖరిని గుడ్డిగా సమర్థించడం విచిత్రంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను శాశ్వతంగా కాపాడుతామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడూ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని గుర్తుచేశారు. భారత ప్రజాస్వామ్యం మెరుగైన పరిపాలన అందించిన రాష్ట్రాలను రాజకీయంగా తొక్కేసే వ్యవస్థగా మారకూడదని ఆకాంక్షించారు. సమాఖ్య సమతౌల్యాన్ని కాపాడుతూ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని రక్షించి సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.