Let's talk: editor@tmv.in
డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Gaddamidi Naveen
13 జూన్, 2026

కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరకులో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ మానవహారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలలో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీంతో అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి సిద్ధమైన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని ఆయన అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఎన్నికల హామీలైన ఉచిత గ్యాస్ సిలిండర్లు, కొత్త పింఛన్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలను మోసగించే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.