
జమ్మలమడుగులో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని టీ కొండూరు గ్రామంలో నిర్మించిన 600 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఎస్ఎఇఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.3,000 కోట్ల భారీ పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు కాలంలోనే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి స్వచ్ఛ ఇంధన విస్తరణకు ఒక నిదర్శనమని రాష్ట్ర పునరుత్పాదక శక్తి రంగ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్ఎఇఎల్ సోలార్ ఎంహెచ్‌పీ 1, ఎస్.ఎ.ఇ.ఎల్ సోలార్ ఎంహెచ్‌పీ 2 పేర్లతో నిర్మితమైన ఈ రెండు 300 మెగావాట్ల ప్రాజెక్టులు ఇంత తక్కువ కాలంలో పూర్తి కావడానికి స్థానిక రైతులు, యువత, జిల్లా అధికారులు అందించిన సహకారమే కారణమని మంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు విజయంతో జమ్మలమడుగు ప్రాంతం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, రానున్న రోజుల్లో అదానీ గ్రూప్, చింతా గ్రీన్, జెన్‌కో–ఎన్‌టీపీసీ పంప్డ్ స్టోరేజ్ వంటి మరిన్ని మెగా పెట్టుబడులు ఈ ప్రాంతానికి రాబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌డీఏ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎకోసిస్టమ్‌లు, ఇన్నోవేషన్, మరియు ప్రత్యేకతలపై ఆధారపడి నడుస్తాయని, అందువల్ల రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, గ్రామస్థులు, కార్మికులు, ఇంజినీర్లు అధికారుల సమిష్టి కృషితోనే ఎస్ఎఇఎల్ సంస్థ ఈ అద్భుత విజయాన్ని సాధించిందని ఆయన అభినందించారు.
సుమారు 2,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ సమగ్ర సౌర విద్యుత్ కేంద్రం ద్వారా స్థానిక 760 రైతు కుటుంబాలు దీర్ఘకాలిక భూ లీజు ఒప్పందాల ద్వారా లబ్ధి పొందుతున్నాయని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు రాబోయే 25 ఏళ్ల వరకు స్థిరమైన భూ లీజు ఆదాయం లభిస్తుందని ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించాయని, ఎంహెచ్‌పీ 1 యూనిట్ జనవరి 30న, ఎంహెచ్‌పీ 2 యూనిట్ మార్చి 13న కార్యకలాపాలు మొదలుపెట్టాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులలో అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 12 లక్షలకు పైగా టాప్‌కాన్ బైఫేషియల్ సౌర మాడ్యూల్స్‌ను ఉపయోగించారు. వీటిలో అత్యధిక భాగం పంజాబ్, రాజస్థాన్‌లలోని ఎస్ఎఇఎల్ స్వంత తయారీ కేంద్రాల్లోనే అసెంబుల్ కావడం విశేషం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న 25 ఏళ్ల ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి ఏడాది సుమారు 11 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, ట్రాన్స్‌మిషన్ తయారీ రంగాల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.
