
దక్షిణాదిలో 129 నుంచి 195కి లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి: అమిత్ షా
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ అమలు తర్వాత దక్షిణ రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు చేయడం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం తీసుకొచ్చిన మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816కు పెరుగుతుందని, దాంతో దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా మరింత పెరుగుతుందని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఐదు దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న 129 లోక్‌సభ స్థానాలు భవిష్యత్తులో 195కు పెరుగుతాయని చెప్పారు. దాంతో వాటి శాతం 23.76 నుంచి 23.87 శాతానికి చేరుతుందని వివరించారు.
రాష్ట్రాలవారీగా చూస్తే,
• కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 స్థానాలు 42కు పెరుగుతాయి.
• ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలు 38కు పెరుగుతాయి.
• తెలంగాణలో 17 స్థానాలు 26కు పెరుగుతాయి.
• తమిళనాడులో 39 స్థానాలు 59కు పెరుగుతాయి.
• కేరళలో 20 స్థానాలు 30కు పెరుగుతాయి.
డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ఏదైనా ‘దురుద్దేశం’తో వ్యవహరిస్తుందనే ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత బిల్లు గతంలో ప్రతిపక్ష ప్రభుత్వమే తీసుకొచ్చిన చట్టానికి సరిగ్గా సమానమని, అందులో ఒక్క కామా లేదా ఫుల్‌స్టాప్ కూడా మార్చలేదని ఆయన అన్నారు. కొత్త లోక్‌సభలో మొత్తం 816 స్థానాలు ఉండేలా నిర్ణయించడంలో కారణం, ప్రస్తుత స్థానాల కంటే 50 శాతం ఎక్కువగా పెంచడమేనని అమిత్ షా వివరించారు. మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పునర్విభజన వల్ల దేశ ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
