
గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు :ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో 'ప్రాడెక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల పై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లు, కేంద్ర ప్రభుత్వ 'భవ్య' (భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన) పథకం కింద చేపట్టే పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
రవాణా వ్యయం తగ్గిస్తేనే పోటీతత్వం
పారిశ్రామికాభివృద్ధిలో లాజిస్టిక్స్ కనెక్టివిటీ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కు రోడ్డు, రైల్వే, పోర్టు అనుసంధానం ఉండేలా మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా వ్యయం తగ్గితేనే మన ఉత్పత్తులు మార్కెట్‌లో పోటీని తట్టుకోగలవని ఇందుకోసం నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ వంటి మౌలిక సదుపాయాలను లాజిస్టిక్ పార్కులతో అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 నాటికి ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
నాణ్యతతోనే ప్రపంచ మార్కెట్‌కు
స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ రావాలంటే నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సీఎం పేర్కొన్నారు. "ప్రాడెక్ట్ పర్ఫెక్షన్" ద్వారానే దేశ, విదేశీ మార్కెట్లను ఆకర్షించగలమని, రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, పారిశ్రామిక క్లస్టర్లలో 'ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా అటు రైతులకు ఇటు పరిశ్రమలకు లబ్ధి చేకూరేలా ప్లాన్ చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన 'భవ్య' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రసాయన తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు పర్యాటక రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులు, ఉద్యోగుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన 'ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లను' అభివృద్ధి చేయాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్" కార్యక్రమం ద్వారా ఏపీని ఎంఎస్‌ఎంఈ రంగంలో అగ్రస్థానంలో నిలపాలని సీఎం పిలుపునిచ్చారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని, ఇందుకోసం విశ్వవిద్యాలయాల్లో హైబ్రిడ్ విధానంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
