
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీలో దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ పై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, పులపర్తి రామాంజనేయులు వెళ్లారు.
లింగమనేని రమేష్ 2015 నుంచి జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సామరస్యం, సరైన సామాజిక ఇంజనీరింగ్ అమలు ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమనే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన పార్టీలో చురుగ్గా నిలిచారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల ఓటమి వంటి అనేక రాజకీయ ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, ఆయన పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రాజ్యసభ అభ్యర్థిత్వం అప్పగించినట్లు సమాచారం.
కూటమి సీట్ల సర్దుబాటు
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు రాజ్యసభ ఎన్నికల సీట్ల సర్దుబాటును ఖరారు చేశాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడు స్థానాల్లో, జనసేన పార్టీ ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించాయి. కూటమి ప్రభుత్వం సాధించిన పాలన, అభివృద్ధి విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు ఎన్డీయే నాయకులు ప్రకటించారు.
అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్డీయే నేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రజా సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూన్ 9న తిరుపతిలో సంక్షేమంపై, జూన్ 12న అమరావతిలో సుపరిపాలనపై, జూన్ 15న విశాఖపట్నంలో అభివృద్ధిపై భారీ సభలు జరగనున్నాయి. జూన్ 13 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కాగా, దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 8 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. 9న పరిశీలన, 11న ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడిస్తారు.
