

ఆర్టీసీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ మనుగడను కాపాడుతూ, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు కార్మిక సంఘాలు ప్రభుత్వంతో కలిసి రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సీఎం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మే డే సందర్భంగా కార్మిక నేతలతో భేటీ కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ మేనేజ్‌మెంట్, కార్మికులు, సంఘాల మధ్య సమన్వయం పెంచుతూ సంస్థను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు, ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై అన్ని సంఘాలు కలిసి చర్చించి ఒకే అభిప్రాయానికి రావాలని సీఎం సూచించారు. ఏకాభిప్రాయం కుదరకపోతే ప్రతి సంఘం తమ ప్రతిపాదనలు విడివిడిగా ఇవ్వవచ్చని, అందులో సామాన్య అంశాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. పెన్షన్ రివిజన్ (పీఆర్సీ) అంశాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులు, మేనేజ్‌మెంట్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం అన్నారు. డిపో స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు కార్మిక సంఘాలతో తరచూ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షలు జరగాలని ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని సీఎం వివరించారు. గత ప్రభుత్వాల బకాయిల సమస్య ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి సుమారు రూ.8,000 కోట్లు అందించామని, పెండింగ్ బకాయిలలో ఈసారి రూ.1,000 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కారుణ్య నియామకాలను కూడా చేపట్టామని గుర్తుచేశారు.
ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డీజిల్‌పై రూ.2,000 కోట్ల వరకు ఖర్చవుతోందని, దీన్ని తగ్గించేందుకు 1,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని చెప్పారు. వీటిని మెట్రో, ఎంఎంటీఎస్‌తో అనుసంధానం చేసి చివరి మైలు కనెక్టివిటీ మెరుగుపరచనున్నట్లు సీఎం వెల్లడించారు.
గాజులరామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏ ఒక్క డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించబోమని సీఎం స్పష్టం చేశారు. సమ్మె కాలంలో వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని, సంస్థ బలంగా ఉంటేనే అందరికీ ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఆర్టీసీని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
