
హెల్మెట్ ధరిద్దాం-ప్రాణాలను కాపాడుకుందాం: హోంమంత్రి అనిత
ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించి తమ కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అడ్డు రోడ్డు నుంచి నక్కపల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు, వాహనదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి స్వయంగా వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ లక్షల రూపాయల విలువైన బైకులు కొనుగోలు చేస్తున్న యువత కేవలం కొన్ని వందల రూపాయల విలువైన ప్రాణాలను రక్షించే హెల్మెట్‌ను ధరించడానికి నిరాకరించడం బాధాకరం. ఈ నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో నియోజకవర్గ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను వీధిన పడేశాయని ఆమె గుర్తు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదని అవి ప్రతి పౌరుడి రక్షణ కోసమేనని అనిత స్పష్టం చేశారు. 'హెల్మెట్ ధరిద్దాం - సురక్షితంగా పయనిద్దాం' అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మేల్కోవాలని బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తోనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె పేర్కొన్నారు. కేవలం పోలీసుల తనిఖీల కోసమే కాకుండా మన ప్రాణాల కోసం హెల్మెట్‌ను ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్ రావు గారితో పాటు పలువురు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
