

తెలంగాణను వ్యతిరేక శక్తుల నుంచి కాపాడుకుందాం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు, పార్టీ కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరులకు వారు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల వల్ల సాకారమైన తెలంగాణను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పాటు అనేది అసమానతలు, అవమానాలు, అణచివేతల నుంచి ప్రజలకు దక్కిన ‘విముక్తి’ అని కేటీఆర్ అభివర్ణించారు. "60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన ఈ పవిత్రమైన రోజున, ప్రజల కోసం మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దాం. తెలంగాణను వ్యతిరేక శక్తుల నుంచి కాపాడుకుందాం" అని ఆయన పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఒకప్పుడు ‘తెలంగాణ వస్తుందా.. కేసీఆర్ సాధ్యం చేస్తారా?’ అని ఎగతాళి చేసిన వేళ, మాజీ సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారని, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రయాణంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కేటీఆర్ గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ బహిరంగ సవాల్
కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రచారాలు, ‘డిక్లరేషన్లు’, నెరవేర్చని ‘420 అలివిగాని హామీల’తోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగ విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 4,000 కొత్త ఉద్యోగాలను కూడా ఎందుకు భర్తీ చేయలేకపోయింది? ఈ కాలమంతా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? దమ్ముంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతను నేరుగా ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకతగా మారుతోందని, తెలంగాణ నేడు ‘ధర్నాల కేంద్రం’గా మారిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ రక్షణ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్దకు వెళ్లి నిరుద్యోగ యువతను కలవాలని సవాల్ విసిరారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి
తెలంగాణ సమాజం ఇప్పుడు ఒకే నినాదంతో ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారు. మా పోరాటం కేవలం రాజకీయ అధికారం కోసం కాదు, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దుష్పరిపాలన సాగుతోందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు కానీ, ఇక్కడి నిధులు మాత్రం రాహుల్ గాంధీ ఖాతాకు చేరుతున్నాయని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై అబద్ధాలు, తప్పుడు కథనాలు, విషపూరిత ప్రచారాలు చేసి రాజకీయాలను కలుషితం చేయడం ద్వారానే కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకుందని, తెలంగాణను రక్షించుకోవడానికి ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
