Let's talk: editor@tmv.in
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం: ఏపీ డిప్యూటీ సీఎం

పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం: ఏపీ డిప్యూటీ సీఎం

Panthagani Anusha
20 మే, 2026

రాష్ట్రంలో స్థానిక సంస్థలు చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలోనూ అత్యంత పారదర్శకత ఉండాలని ప్రజలకు పూర్తి జవాబుదారీగా పంచాయతీరాజ్ శాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల శాఖ సాధించిన ప్రగతి, రాబోయే ప్రణాళికలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పారదర్శక పాలనకు పెద్దపీట వేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

కాగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు అదేవిదంగా ప్రస్తుత రోడ్ల పరిస్థితిని ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఒక ప్రత్యేక పబ్లిక్ డ్యాష్ బోర్డు ను రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనికీ నిర్దుష్ట కాలపరిమితి విధించుకోవాలని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని పేర్కొన్నారు. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పనిని బాధ్యతగా తీసుకోవాలని ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపినప్పుడే రోడ్ల అసలు పరిస్థితి అవగతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 'స్వర్ణ పంచాయతీ పోర్టల్' ద్వారా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేయడం పట్ల ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీలు తమ స్వయం సమృద్ధి కోసం ఆదాయ వనరులను మరింతగా పెంచుకోవాలని ఇదే సమష్టి కృషిని రాబోయే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ‘స్వమిత్వ’ ల్యాండ్ సర్వే సజావుగా సాగడానికి రెవెన్యూ, సర్వే శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో భాగంగా ప్రవేశపెట్టిన 'స్వచ్ఛరథం' విధానం గ్రామీణ ప్రాంతాల్లో అద్భుత ఫలితాలను ఇస్తోందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పొడి వ్యర్థాలను అందించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులను తీసుకెళ్లడం శుభపరిణామన్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో అమలవుతున్న ఈ విధానాన్ని మరింత విస్తరించాలని చెప్పారు. ఏప్రిల్ నెలలోనే స్వచ్ఛరథాల ద్వారా సుమారు రూ. 3 కోట్ల విలువైన 18.86 లక్షల కేజీల పొడి చెత్తను సేకరించడం విశేషమన్నారు.

తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైన 'గ్రీన్ షాప్' విధానాన్ని కూడా ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే నిత్యావసరాలు లభిస్తాయనే అంశంపై గ్రామీణ ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని తద్వారా పారిశుధ్యంపై వారిలో అవగాహన పెంచాలని సూచించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.