

వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలిద్దాం: రాష్ట్ర స్థాయి సదస్సులో మంత్రుల పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థలను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తన పోరాటాన్ని ఉధృతం చేసింది. పోలీసు విభాగంలోని ఉమెన్ సేఫ్టీ వింగ్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.
వెట్టిచాకిరీ అనేది మానవ గౌరవానికి విఘాతం కలిగించే తీవ్రమైన నేరమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దీనిని నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాధితుల రక్షణ, పునరావాసం, గృహ వసతి, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారు దోపిడీకి గురికాకుండా కాపాడుతున్నామని చెప్పారు. సామాజిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ ఉంటేనే వెట్టిచాకిరీ వంటి సామాజిక రుగ్మతలను నిరోధించగలమని, దీనిపై సమిష్టిగా పోరాడాలని ఆమె అన్నారు. మహిళల ఆర్థిక స్వతంత్రత పెరిగినప్పుడే సమాజంలో దోపిడీ తగ్గుతుందని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ అనేది కేవలం కార్మిక సమస్య మాత్రమే కాదని, ఇది ఒక వ్యవస్థీకృత నేరమని పేర్కొన్నారు. బాధితులను తప్పుడు వాగ్దానాలతో ప్రలోభపెట్టి, అక్రమంగా బంధిస్తారని, వారిని గుర్తించడానికి ఆధునిక సాంకేతికతను వాడాలని పోలీసులకు సూచించారు. అదనపు డీజీపీ (ఉమెన్ సేఫ్టీ వింగ్) చారు సిన్హా మాట్లాడుతూ.. కేవలం అక్రమ రవాణాపైనే కాకుండా, పెద్దవారిలో ఉండే వెట్టిచాకిరీపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. అప్పుల పేరుతో బంధీలుగా మార్చడం నేరమని, బాధితుల గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ దర్యాప్తు జరగాలని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ మాట్లాడుతూ.. కేవలం బాధితులను రక్షించడం సరిపోదని, వారికి సరైన పునరావాసం కల్పిస్తేనే మళ్లీ ఆ ఊబిలో పడకుండా ఉంటారని తెలిపారు. కనీస వేతనాలు చెల్లించకపోవడం కూడా బలవంతపు చాకిరీ కిందకే వస్తుందని లీగల్ సర్వీసెస్ అథారిటీ స్పష్టం చేసింది.
ఈ సదస్సులో 200 మందికి పైగా పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. అక్రమ రవాణా నిరోధక విభాగాల పాత్రను పెంచాలని, కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలని సదస్సు తీర్మానించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పించడం ద్వారానే ఇటువంటి దోపిడీ వ్యవస్థలను అంతం చేయగలమని మంత్రులు పేర్కొన్నారు.
