
ముందు నోటీసు రానివ్వండి.. మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఖర్గే ‘నోటీసు రానివ్వండి… మా వారు సమాధానం ఇస్తారు’ అని తెలిపారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, నోటీసుకు తాము సమగ్రంగా స్పందిస్తామని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, తాను ప్రధాని మోడీని నేరుగా ‘టెర్రరిస్ట్’ అని అనలేదని, ప్రజలను, రాజకీయ పార్టీలను భయపెడుతున్నారని (టెర్రరైజ్ చేస్తున్నారని) మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందిస్తూ, వరుస ఎన్నికల ఓటముల వల్ల నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఖర్గేకు మద్దతుగా నిలుస్తూ, సీనియర్ నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బీజేపీ ఇతరులను తక్కువగా చూస్తుందనే భావనను ఇది చూపుతోందని విమర్శించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది.
ఇంధన, ఎరువుల భద్రతలో బీజేపీ ‘డబుల్ ఫెయిల్’
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఇంధన, ఎరువుల భద్రతను నిర్ధారించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ఈ విషయంలో ప్రభుత్వం ‘డబుల్ ఫెయిల్’ సాధించిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో, దేశంలో ఇంధన ఉత్పత్తి తగ్గిందని, దిగుమతుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద 14 భారత జెండా నౌకలు 50 రోజులకు పైగా నిలిచిపోయాయని తెలిపారు. దేశంలో ముడి చమురు ఉత్పత్తి వరుసగా 11వ సంవత్సరంగా తగ్గుతుండగా, 2014-15తో పోలిస్తే దాదాపు 22 శాతం పడిపోయిందని పేర్కొన్నారు. గ్యాస్ ఉత్పత్తి కూడా సుమారు 40 శాతం వరకు తగ్గిందని తెలిపారు. అదే సమయంలో ఎరువుల కొరతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2026 మార్చిలో ఎరువుల ఉత్పత్తి ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను పరిమితం చేయడం, రష్యా ఎగుమతులు నిలిపివేయడం వంటి పరిణామాలపై కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఖర్గే విమర్శించారు.
