Let's talk: editor@tmv.in
తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం

Panthagani Anusha
26 మే, 2026

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ క్లినికల్ కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో ఒక సంవత్సరం వయస్సు గల ఆడ చిరుత కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో రక్షణ చర్యలు చేపట్టారు.

ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. చిరుతను ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహంతో ఆపరేషన్ నిర్వహించారు. అటవీ శాఖ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి ట్రాంక్విలైజర్ సహాయంతో చిరుతను అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ఘటనపై తిరుపతి జూ క్యూరేటర్ అనురాగ్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం సమీప అటవీ ప్రాంతాల నుంచి ఆహారం లేదా నీటి కోసం సంచరిస్తూ చిరుత యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అదుపులోకి తీసుకున్న ఆడ చిరుతను అధికారులు వెంటనే తిరుపతిలోని ఎస్వీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్) లో ఉన్న యానిమల్ రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం వెటర్నరీ వైద్యుల బృందం దాని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిరుత ఆరోగ్యంగా ఉందని కొద్ది రోజులపాటు పరిశీలనలో ఉంచిన తర్వాత అడవిలో విడిచిపెట్టే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

ఈ ఘటనతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో ఆందోళన నెలకొనగా అటవీ శాఖ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత పెంచింది. అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల పరిరక్షణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.