Let's talk: editor@tmv.in
కార్మిక హక్కుల అణచివేతపై జంతర్ మంతర్ వద్ద వామపక్షాల గర్జన!
కార్మిక హక్కుల అణచివేతపై జంతర్ మంతర్ వద్ద వామపక్షాల గర్జన!

కార్మిక హక్కుల అణచివేతపై జంతర్ మంతర్ వద్ద వామపక్షాల గర్జన!

Dantu Vijaya Lakshmi Prasanna
25 ఏప్రిల్, 2026

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న కార్మిక అసంతృప్తి, కార్మిక నేతల అరెస్టులు, హక్కుల అణచివేతకు నిరసనగా శుక్రవారం జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించాయి.

సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ), ఫార్వర్డ్ బ్లాక్, కమ్యూనిస్ట్ గద్దర్ పార్టీ ఆఫ్ ఇండియా (సీజీపీఐ) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆందోళనకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం వంటి విద్యార్థి సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి. నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ వంటి పారిశ్రామిక క్లస్టర్లలో కార్మికుల గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై ఈ నిరసన ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా నోయిడా, పరిసర ప్రాంతాల్లో కనీస వేతనాల అమలు జరగకపోవడం, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోవడం, పని ప్రదేశాల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలను నిరసనకారులు ఎత్తిచూపారు. కార్మిక చట్టాలను యజమాన్యాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని, అధికారులు మాత్రం వారికి వత్తాసు పలుకుతున్నారని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కార్మికులను వెట్టిచాకిరీలోకి నెట్టడం అన్యాయమని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ.. పారిశ్రామిక బెల్టులో కార్మికుల ప్రాథమిక హక్కులను క్రమపద్ధతిలో నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. వేతనాల పెంపు, ఉద్యోగ క్రమబద్ధీకరణ, మెరుగైన పని పరిస్థితుల కోసం కార్మికులు సంఘటితమవ్వడాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోందని ఆమె విమర్శించారు.

కార్మికులు తమ డిమాండ్ల కోసం గొంతెత్తితే లాఠీఛార్జీలు, అరెస్టులు, అక్రమ కేసులు బహుమతిగా వస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. పోలీసు బలగాలను ఉపయోగించి కార్మిక ఉద్యమాలను అణచివేయాలని చూడటం దుర్మార్గమని, ఇది పారిశ్రామిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.

సీపీఐ నాయకురాలు అమర్జిత్ కౌర్, ఇతర వామపక్ష ప్రతినిధులు మాట్లాడుతూ.. నోయిడా ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్మిక ఆందోళనల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మిక నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని వారు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన సదుపాయాలు అందడం లేదని, ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు బాధ్యత వహించడం లేదని ఆరోపించారు. కార్మిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకుండా, కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వారు విమర్శించారు.

నిరసన అనంతరం వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, కార్మిక శాఖ మంత్రికి ఒక మెమోరాండం సమర్పించారు. ఇందులో ప్రధానంగా ఐదు డిమాండ్లను పొందుపరిచారు. అరెస్టు చేసిన కార్మిక నేతలను వెంటనే విడుదల చేయాలి. కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. కనీస వేతన చట్టాలను కఠినంగా అమలు చేయాలి. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను క్రమబద్ధీకరించాలి. పారిశ్రామిక మండలాల్లో కార్మిక శాఖల జవాబుదారీతనాన్ని పెంచాలి.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పారిశ్రామిక ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలపై తమ పోరాటం ఇక్కడితో ఆగదని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. ప్రభుత్వం, యాజమాన్యాలు మొండి వైఖరిని వీడకపోతే, రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా కార్మిక సెంటర్లు, ఫ్యాక్టరీల వద్ద ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత, పౌర సమాజం కూడా కార్మికుల హక్కుల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక శాంతి నెలకొనాలంటే కార్మికుల గౌరవాన్ని, వారి న్యాయబద్ధమైన హక్కులను కాపాడటం ఒక్కటే మార్గమని వారు ఉద్ఘాటించారు.