Let's talk: editor@tmv.in
‘శాంతి’ బాట వీడి.. ఆయుధాల ఎగుమతికి జపాన్ గ్రీన్ సిగ్నల్

‘శాంతి’ బాట వీడి.. ఆయుధాల ఎగుమతికి జపాన్ గ్రీన్ సిగ్నల్

Shaik Mohammad Shaffee
22 ఏప్రిల్, 2026

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల కాలంగా అనుసరిస్తున్న కఠిన శాంతివాద రక్షణ విధానానికి జపాన్ స్వస్తి పలికింది. ఇన్నాళ్లూ ఇతర దేశాలకు వినాశకర ఆయుధాలను విక్రయించకూడదన్న నిబంధనలను సడలిస్తూ ప్రధానమంత్రి సనాయే తకైచి కేబినెట్ మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చైనా, ఉత్తర కొరియాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు, స్వదేశీ రక్షణ పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది.

ఏమిటీ మార్పు? ఎందుకీ నిర్ణయం?

రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి జపాన్ తన రాజ్యాంగం ప్రకారం రక్షణ విషయంలో అత్యంత నియంత్రణతో వ్యవహరిస్తోంది. గతంలో రక్షణ ఎగుమతులు కేవలం రవాణా, నిఘా వంటి ఐదు రంగాలకే పరిమితమై ఉండేవి. కానీ తాజా నిర్ణయంతో ఇకపై యుద్ధ విమానాలు, క్షిపణులు, విధ్వంసక నౌకలు (డిస్ట్రాయర్లు), యుద్ధ డ్రోన్లు వంటి శక్తివంతమైన ఆయుధాలను విక్రయించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. పొరుగు దేశాలైన చైనా, రష్యా, ఉత్తర కొరియాల దుందుడుకు చర్యల నేపథ్యంలో జపాన్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దేశీయ రక్షణ పరిశ్రమను లాభసాటిగా మార్చడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం.

అమ్మకాలు ఓకే.. కానీ షరతులు వర్తిస్తాయి!

జపాన్ ఆయుధాల ఎగుమతులకు పచ్చజెండా ఊపినప్పటికీ, ఇష్టానుసారంగా అమ్మకుండా కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. ప్రస్తుతం జపాన్‌తో రక్షణ ఒప్పందాలు ఉన్న 17 దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం యుద్ధంలో ఉన్న దేశాలకు మాత్రం నేరుగా ఎటువంటి మారణాయుధాలను అందించరు. కానీ అమెరికా వంటి మిత్రదేశాల నుంచి లైసెన్సు పొంది తయారు చేసే ఆయుధాల విషయంలో మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రతి విక్రయాన్ని జాతీయ భద్రతా మండలి స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఆయుధాలు దుర్వినియోగం కాకుండా, వాటిని కొనుగోలు చేసిన దేశాలు ఎలా వాడుతున్నాయనే విషయంలో ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతూ కఠిన తనిఖీలు చేపడుతుంది.

ఆస్ట్రేలియాతో భారీ డీల్.. ప్రపంచ దేశాల ఆసక్తి

జపాన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఆ దేశ రక్షణ రంగానికి ఒక్కసారిగా కొత్త ఊపు వచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సుమారు రూ. 54 వేల కోట్ల విలువైన భారీ రక్షణ ఒప్పందాన్ని జపాన్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మిత్సుబిషి సంస్థ తయారు చేసిన మూడు అత్యాధునిక 'మొగామి' యుద్ధ నౌకలను ఆస్ట్రేలియాకు విక్రయించడంతో పాటు, మరో ఎనిమిది నౌకలను రెండు దేశాలు కలిసి నిర్మించనున్నాయి. కేవలం ఆస్ట్రేలియానే కాకుండా.. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి ఆసియా దేశాలు కూడా జపాన్ యుద్ధ నౌకలు, రాడార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు బ్రిటన్, ఇటలీ దేశాలతో కలిసి జపాన్ అత్యంత శక్తివంతమైన 'ఆరో తరం' యుద్ధ విమానాల తయారీలో పాలుపంచుకుంటూ అంతర్జాతీయ రక్షణ కూటముల్లో తన పట్టును పెంచుకుంటోంది.

విమర్శలు - ప్రతి విమర్శలు

జపాన్ నిర్ణయంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆసియాలో ఉద్రిక్తతలను పెంచుతుందని మండిపడింది. దేశీయంగానూ ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే “మారుతున్న భద్రతా వాతావరణంలో దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం, పారిశ్రామిక పునాదిని నిర్మించడం తప్పనిసరి" అని చీఫ్ కేబినెట్ కార్యదర్శి మినోరు కిహారా స్పష్టం చేశారు.