

మత్తు వదలండి… మైదానాలు చేరండి: మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్ జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం మైదానంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.12.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆధునిక క్రీడా సదుపాయాల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టులో రూ.10.70 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 400 మీటర్ల ఎనిమిది లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, రూ.1 కోట్లతో నాలుగు ఓపెన్ జిమ్‌లు, రూ.51 లక్షలతో ఇండోర్ జిమ్, మహిళల అథ్లెటిక్స్ హాస్టల్ మిగిలిన పనులకు రూ.32 లక్షలు వెచ్చించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. “మత్తు వదలండి... మైదానాలు చేరండి” అనే సందేశాన్ని ఆయన యువతకు అందించారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే సుమారు రూ.80 కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైతే క్రీడా అభివృద్ధి కోసం రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సీఎం కప్ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తున్నామని, మొదటి ఎడిషన్‌లో 3.5 లక్షల మంది, రెండో ఎడిషన్‌లో 5.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని,మూడవ ఎడిషన్ లో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక అకాడమీల్లో శిక్షణ, ప్రయాణం, వసతి తదితర ఖర్చులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ భరిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకంతో మహబూబ్‌నగర్‌కు ఈ ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు. జిల్లాలో వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే భూముల సేకరణ చేపట్టి క్రీడలకు సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపారు. యువతకు క్రీడల ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును బలోపేతం చేయాలని సంకల్పించామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాబోయే రోజుల్లో దేశంలోనే క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా బడ్జెట్‌ను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని తెలిపారు. సీఎం కప్ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయడంతో పాటు అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి. జానకి, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
