
అమెరికాలోని ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి.. ప్రాణాలొదిలిన అనురూప్‌కు నేతల నివాళి
ఇటీవల అమెరికాలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడే క్రమంలో తన ప్రాణాలొదిలిన అనురూప్ రెడ్డికి భౌతిక కాయం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కవాడిపల్లి గ్రామానికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అనురూప్ రెడ్డి నివాసానికి వెళ్లి అతని భౌతికకాయానికి నివాళులర్పించారు.
కేవలం 23 ఏళ్ల వయసులోనే తన ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అనురూప్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు. అనురూప్ రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. అతని జీవితం చిన్నదైనా, అతను కాపాడిన ప్రాణాల ద్వారా అతని స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. అనంతరం చామల కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం రేవంత్ రెడ్డి పంపిన సంతాప సందేశం లేఖను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం
ఆ లేఖలో అమెరికాలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడే క్రమంలో తన ప్రాణాలను అర్పించిన తెలంగాణ బిడ్డ కోడూరు అనురూప్ రెడ్డికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అత్యంత విషాదభరితమైన ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున అనురూప్ తల్లిదండ్రులకు, సోదరుడు ఆశ్రిత్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనురూప్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ తీవ్ర విషాద సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
అమెరికాలోని లూసియానా రాష్ట్రం, టోరో బయూ పార్క్‌లో 2026 మే 29న చోటుచేసుకున్న అనురూప్ విషాద మరణ వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న అనురూప్.. అసామాన్య ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవాభావం, పరాక్రమాన్ని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
ప్రమాదంలో మునిగిపోతున్న తన ముగ్గురు స్నేహితులను కాపాడాలని, అత్యంత క్లిష్టమైన సమయంలో ఏమాత్రం వెనుకాడకుండా అనురూప్ నీటిలోకి దూకి రక్షించారని సీఎం గుర్తుచేశారు. ఈ వీరోచిత చర్యతో స్నేహితుల ప్రాణాలను కాపాడినప్పటికీ, అనురూప్ మనకు దూరం కావడం అత్యంత విషాదకరమన్నారు. ఆ సందర్భంలో అనురూప్ ప్రదర్శించిన మానవతా విలువలు, కరుణ, ధైర్య సాహసాలు మహోన్నత త్యాగానికి నిదర్శనమని కొనియాడారు.
