


రాష్ట్రంలో 6,500కు పైగా గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డులను ఆధునీకరించే లక్ష్యంతో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా 6,500కు పైగా గ్రామాల్లో విజయవంతంగా పూర్తయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో ‘మీ భూమి - మీ హక్కు’ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి, భూ రికార్డులను నవీకరించాం. ఇందులో భాగంగా 26.4 లక్షల మంది రైతులకు ఎటువంటి తప్పులు లేని పగడ్బందీ ‘పట్టాదార్ పాస్‌పుస్తకాలను’ అందజేశాం” అని వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90 లక్షల మందికి లోపరహితమైన పాస్‌పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా మిగిలిన 62.3 లక్షల పాస్‌బుక్కులను ఒక ఖచ్చితమైన కాలపరిమితిలో పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ‘రీసర్వే 2.0’ కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ ప్రక్రియ పూర్తయిందని, భూ వివాదాలకు తావులేకుండా ఉండేందుకు వీలుగా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
గత పాలకులు 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' అనే నల్ల చట్టాన్ని తెచ్చి ప్రజల భూములను కాజేయడానికి, రికార్డులను ప్రైవేటుకు అప్పగించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి హక్కులను కాపాడామన్నారు. రైతులకు చెందిన భూమిపై గత సీఎం తన బొమ్మలు వేసుకుని రూ.800 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల తరహాలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్, అధికారిక ‘రాజముద్ర’తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
అక్వా రంగానికి పూర్తి మద్దతు
గోదావరి జిల్లాల ఆర్థిక పురోభివృద్ధిని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని చంద్రబాబు తెలిపారు. స్థానిక, దేశీయ ఆర్థిక వ్యవస్థలకు అక్వాకల్చర్ (రొయ్యలు, చేపల సాగు) అత్యంత కీలకమని ఆయన నొక్కిచెప్పారు. కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్న అక్వా రంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం, ఇతర అంతర్జాతీయ కారణాల వల్ల అక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా అక్వా ఫీడ్ ధరలు భారీగా పెరిగాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరల నియంత్రణ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వారి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. అక్వాకల్చర్ నుంచి వచ్చే వ్యర్థాలను పర్యావరణ కాలుష్యంగా మార్చకుండా, వాటిని ‘నూట్రాస్యూటికల్ మందుల’ తయారీకి ఉపయోగపడేలా సరికొత్త సాంకేతికతను తీసుకురావచ్చని సీఎం సూచించారు.
పశుగ్రాసం (సోయాబీన్ మీల్) ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు, సోయాబీన్ మీల్ దిగుమతులపై పన్నులు తగ్గించాలని, సబ్సిడీలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశామని, కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20,000 ఇస్తున్నామని చెప్పారు. గతంలో ధాన్యం డబ్బుల కోసం 6 నెలలు వేచి చూడాల్సి రాగా, నేడు తమ ప్రభుత్వం 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. ఆక్వా జోన్ పరిధిలో రూ.1.50 కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామని, అంతర్జాతీయ కారణాల వల్ల పెరిగిన మేత ధరల తగ్గింపుపై కేంద్రంతో మాట్లాడుతున్నామని వివరించారు.
విపక్షాల విమర్శలపై తిప్పికొట్టిన సీఎం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి కనెక్షన్ అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాబోయే రోజుల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను సీఎం తీవ్రంగా ఖండించారు. పరీక్షలు, రిజర్వేషన్లపై కనీస అవగాహన జ్ఞానం లేని ప్రతిపక్ష నేతలు కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతిరోజూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం వల్లే రాష్ట్రంలో అనేక భూ వివాదాలు తలెత్తాయని, ఆ అక్రమాలకు గత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
