Let's talk: editor@tmv.in
జులై 2న మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం: క‌విత‌
జులై 2న మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం: క‌విత‌

జులై 2న మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం: క‌విత‌

Gaddamidi Naveen
3 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కార్యాలయంలో పార్టీ అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఆర్తితో స్మరించుకుంటూ, ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేశారు.

తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆగస్ట్ 6వ తేదీ లోపు హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లయినా రాజధానిలో ఆయన విగ్రహం లేకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ జాగృతి తరఫున ఇప్పటికే నాలుగు జిల్లాల్లో విగ్రహాలు పెట్టామని, హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తే తామే సొంత ఖర్చులతో పాటు లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. జూన్ 2 అనేది కేవలం ఒక సెలవు దినం కాదని, ఆత్మగౌరవాన్ని తెచ్చిన రోజు అని, నేటి యువత ఈ చరిత్రను తెలుసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై, కేకే కమిటీ విధివిధానాలపై ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో, జూలై 2న ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ తరహాలో భూపోరాటం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోరాటానికి పార్టీలతో సంబంధం లేదని.. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, పాత్రికేయులు అందరూ ఊరికి ఒక్కరైనా సద్ది కట్టుకుని వచ్చి, మరో ‘మిలియన్ మార్చ్’ను తలపించేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన వెంటనే అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని, ఉద్యమకారులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని కవిత భరోసా ఇచ్చారు.