Let's talk: editor@tmv.in
తక్కువ ధరకే భూ కేటాయింపులు పెట్టుబడులను ఆకర్షిస్తాయి: ఏపీఐఐసీ చైర్మన్

తక్కువ ధరకే భూ కేటాయింపులు పెట్టుబడులను ఆకర్షిస్తాయి: ఏపీఐఐసీ చైర్మన్

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. పరిశ్రమల స్థాపనకు ప్రధాన వనరు అయిన భూమిని అత్యంత తక్కువ ధరలకే కేటాయిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ రామరాజు మంటెన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో కూడిన పారిశ్రామిక విధానాలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా రాబోయే మూడేళ్ల కాలంలో (2024-2026) సుమారు 30,000 ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రామరాజు వెల్లడించారు. ఇది ఏపీఐఐసీ చరిత్రలోనే రికార్డు స్థాయి కేటాయింపు అని ఆయన పేర్కొన్నారు. కేవలం భూమిని కేటాయించడమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రంగాలకు కేవలం 99 పైసలకే భూమిని లీజుకు ఇచ్చే వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

స్టీల్ హబ్‌గా విశాఖ.. డేటా సెంటర్లకు ప్రాధాన్యం

విశాఖపట్నం పరిసర ప్రాంతాలు భవిష్యత్తులో గ్లోబల్ స్టీల్ హబ్‌గా అవతరించనున్నాయని చైర్మన్ తెలిపారు. అచ్యుతాపురం, నక్కపల్లి వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం అందించిన రూ.12,000 కోట్ల ప్యాకేజీ ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుందని చెప్పారు. కడపలో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్‌తో పాటు, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటితో పాటు డేటా సెంటర్లు, ఐటీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఉపాధి కల్పనతోనే రాష్ట్ర పురోభివృద్ధి

పరిశ్రమల రాక కేవలం పన్నుల ఆదాయానికే పరిమితం కాదని దీని వెనుక పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ఉందని రామరాజు మంటెన విశ్లేషించారు. పెద్ద పరిశ్రమలు వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇది అంతిమంగా రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని అధిగమించి ఉత్తమ రాయితీలతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు.

వికేంద్రీకృత పారిశ్రామికీకరణ

అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా రాష్ట్రమంతటా విస్తరింపజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ కర్నూలులో రక్షణ రంగ ప్రాజెక్టులు, డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా అనంతపురం, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు భూముల సేకరణ, కేటాయింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని తద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీఐఐసీ చైర్మన్ స్పష్టం చేశారు.