Let's talk: editor@tmv.in
లడఖ్ రాజకీయ చర్చలు మళ్లీ ప్రారంభం

లడఖ్ రాజకీయ చర్చలు మళ్లీ ప్రారంభం

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

లడఖ్ ప్రాంతానికి సంబంధించిన కీలక రాజకీయ సమస్యలపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లడఖ్ ప్రతినిధులతో రాజకీయ చర్చల కోసం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సమావేశాన్ని మే 22న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌ కుమార్‌‌ సక్సేనా వెల్లడించారు. ఫిబ్రవరి ప్రారంభంలో చివరిసారిగా సమావేశం జరిగిన తర్వాత ఇది తదుపరి చర్చగా నిలవనుంది. 2021 నుంచి లేహ్ ఏపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) కలిసి కేంద్రంతో చర్చలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర హోదా అలాగే లడఖ్‌ను ఆరో షెడ్యూల్‌ పరిధిలో చేర్చాలని ఇవి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. లడఖ్ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఈ చర్చలు కీలకమని పేర్కొన్న లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్మాణాత్మక సంభాషణలు నిర్వహించి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చర్చలు ఆలస్యం అవుతున్నాయని కేడీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 4న జరిగిన సమావేశం తర్వాత 10–15 రోజుల్లో మరో సమావేశం జరుగుతుందని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ, అది అమలు కాలేదని కేడీఏ సహాధ్యక్షుడు అస్గర్ అలీ కర్బలై పేర్కొన్నారు. అయితే తాజా సమావేశం నిర్ణయంతో చర్చలు మళ్లీ పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏప్రిల్‌ 30న లడఖ్‌కు అమిత్‌షా

ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను తెచ్చాయి. సెప్టెంబర్‌లో జరిగిన నిరసనల హింస కేసులో అరెస్టైన నాయకులు డెల్డాన్ నమ్‌గ్యాల్, స్మాన్లా దోర్జేలను విడుదల చేశారు. అలాగే వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ కూడా మార్చి 14న విడుదలయ్యారు. ఆయనను నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద నిర్బంధించారు. లడఖ్ అంశంపై చర్చల కోసం 2024 ఫిబ్రవరి 19న హై పవర్డ్ కమిటీ (హెచ్‌పీసీ) ఎల్‌ఏబీ-కేడీఏ ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రధానంగా లడఖ్ ప్రాంతపు ప్రత్యేక సంస్కృతి, భాషను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారిస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏప్రిల్ 30న లేహ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. మే 1న జరిగే బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధుడి పవిత్ర అవశేషాలకు ఆయన నివాళులు అర్పించనున్నారు. ఈ పర్యటన, అలాగే చర్చల పునఃప్రారంభం, లడఖ్ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై కేంద్ర ప్రభుత్వ కట్టుబాటును సూచిస్తున్నాయని అధికారులు తెలిపారు.