
సంగారెడ్డి జైలులో మన్నె క్రిషాంక్‌ను పరామర్శించిన కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ, తప్పుడు కేసులతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంగారెడ్డి జైలులో నిర్బంధంలో ఉన్న టీఎస్ఎండీసీ మాజీ ఛైర్మన్ మన్నె క్రిషాంక్ ను ఆయన పరామర్శించారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, తదితర ముఖ్య నేతలు క్రిషాంక్‌ను కలిశారు.
జైలు వెలుపల మీడియాతో మాట్లాడిన కేటీఆర్, క్రిషాంక్‌పై వరుసగా సుమారు 35 కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. క్రిషాంక్ ఒక చదువుకున్న యువకుడు, న్యాయవాది, పీహెచ్‌డీ పట్టా పొందిన వ్యక్తి. కేవలం ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా, 12 రోజులుగా జైలులో ఉంచి 'హ్యాబిచ్యువల్ అఫెండర్'గా చూపించడం దుర్మార్గమని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బినామీ కంపెనీల వ్యవహారాలను బయటపెట్టడం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతిని వెలుగులోకి తేవడం, గ్రామీణ స్థాయిలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించడం వంటి అంశాలపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా పోస్టులపై మాత్రమే అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్‌లో పట్టపగలు కాల్పులు జరిగినా స్పందించని ప్రభుత్వం, ఎవరు ట్వీట్ చేశారన్నదానిపైనే దృష్టి పెట్టిందన్నారు.
పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్, జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా క్రిషాంక్‌ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఈ అంశంపై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులను వేధించినా వెనక్కి తగ్గబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, ఎవరూ భయపడవద్దని, పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు.
