Let's talk: editor@tmv.in
నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న కేటీఆర్

నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న కేటీఆర్

Gaddamidi Naveen
5 జులై, 2026

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌజ్ మోటార్లను వెంటనే ప్రారంభించి, గోదావరి జలాలను రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం నేడు (ఆదివారం) కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించనుంది. ప్రస్తుతం గోదావరిలో ప్రవహిస్తున్న నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ, వాటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.

పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతో గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లు కేవలం 23 శాతం మాత్రమే నిండి ఉన్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ప్రస్తుతం సుమారు 15 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా, రానున్న రోజుల్లో అది 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశముందని పేర్కొంది.

ఈ పరిస్థితుల్లో మేడిగడ్డ బ్యారేజ్‌పై పూర్తిగా ఆధారపడకుండా, కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా నీటిని మళ్లించి పంపింగ్ చేపట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారని బీఆర్ఎస్ తెలిపింది. అలాగే కన్నెపల్లి మోటార్లను ప్రారంభిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి ప్రవాహాన్ని వినియోగించి వ్యవసాయ అవసరాలతో పాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చవచ్చని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించనుంది.

ట్యాగ్‌లు
KaleshwaramProjectKTRBRSGodavariKannapalliTelanganaFarmersIrrigationWaterManagementGodavariWatersKaleshwaramTelanganaPolitics
నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న కేటీఆర్ - Tholi Paluku