


కన్నెపల్లిలో కేటీఆర్ ఫైర్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి సవాల్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పర్యటనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన కేటీఆర్, చివరికి అన్ని అడ్డంకులను అధిగమించి కన్నెపల్లికి చేరుకున్నామని తెలిపారు.
కన్నెపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకోవడానికి సాధారణంగా నాలుగు గంటల సమయం పడుతుందని, అయితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో పోలీసులు అడుగడుగునా తమ వాహనాలను అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు తమ పర్యటనను అడ్డుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌పై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు తాము రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు, తెలంగాణ ప్రజలకు జరిగిన మేలు ప్రజలకు తెలియజేయడమే తమ ఉద్దేశమని కేటీఆర్ స్పష్టం చేశారు.
దశాబ్దాల నీటి పోరాటానికి ఫలితమే కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దశాబ్దాలుగా గోదావరి జలాల కోసం ఉద్యమాలు జరిగాయని, గోదావరి నుంచి వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుండగా తెలంగాణ రైతులు నీటి కోసం ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా నదులు లోతైన ప్రాంతాల్లో ప్రవహిస్తుండటంతో, ఎగువ ప్రాంతాలకు నీటిని లిఫ్ట్ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు.
ఈ సవాలును గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు తరలించే బృహత్తర ప్రణాళిక రూపొందించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించారని చెప్పారు.
తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు నిర్ణయాల వెనుక కారణాలు
ప్రారంభంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని భావించామని, అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తు పెంచేందుకు అంగీకరించలేదని కేటీఆర్ తెలిపారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రాజెక్టు ఎత్తు పెంచితే తమ ప్రాంతాలు మునిగిపోతాయని స్పష్టం చేశారని చెప్పారు.
అంతకుముందే మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తుమ్మిడిహట్టి ఎత్తు పెంచవద్దంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిందని పేర్కొన్నారు. దీంతో సాంకేతిక నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించామని వివరించారు.
మూడున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేశాం
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును కేవలం మూడున్నరేళ్లలో పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండున్నరేళ్లుగా తుమ్మిడిహట్టి అంశంపైనే కాలయాపన చేస్తోందని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు గురించి తాను పుట్టినప్పటి నుంచి వింటున్నానని, దాదాపు ఐదు దశాబ్దాలైనా పూర్తి కాలేదని పోల్చిచెప్పారు. అయితే మండుటెండలు, కరువు పరిస్థితుల్లో కూడా నీటి లభ్యత ఉండే ప్రాంతంలో కాళేశ్వరం నిర్మించి రైతులకు నీరు అందించామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక బ్యారేజీ కాదని, మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, సబ్‌స్టేషన్లు, 1,531 కిలోమీటర్ల కాల్వలతో కూడిన భారీ నీటి పారుదల వ్యవస్థ అని కేటీఆర్ వివరించారు.
మేడిగడ్డ మరమ్మతులపై విమర్శలు
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందేనని, అయితే వాటి మరమ్మతులు ఇప్పటికీ చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు. సుమారు రూ.400 కోట్లతో మరమ్మతులు పూర్తవుతాయని, ప్రజలపై అదనపు భారం పడకుండా ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
"కాళేశ్వరం కూలిపోయింది" అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని అన్నారు.
కన్నెపల్లిలో నీరు ఉన్నా పంపులు ఆన్ చేయడం లేదు
ప్రస్తుతం కన్నెపల్లి వద్ద సమృద్ధిగా నీరు అందుబాటులో ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం పంపులు ఆన్ చేయకుండా 98 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీ పూర్తిస్థాయిలో అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు. రైతులు కూడా పంపులు ఆన్ చేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
మిడ్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులకు అవసరమైనప్పుడు నీటిని తరలించే అవకాశం కాళేశ్వరం ద్వారా ఉందని, అవసరమైతే రివర్స్ పంపింగ్ ద్వారా కూడా నీటిని నింపవచ్చని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని కేటీఆర్ తెలిపారు. కాకతీయ కాల్వల్లో నీరు లేకపోయినప్పుడు కూడా కాళేశ్వరం ద్వారా నీటిని అందించామని చెప్పారు. అప్పర్ మానేరు రిజర్వాయర్ నిండటానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు.
హైదరాబాద్‌కు తాగునీటి సమస్య పెరిగిందని ఆరోపణ
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సక్రమంగా వినియోగించకపోవడం వల్ల హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రమైందని కేటీఆర్ ఆరోపించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 15 వేల వరకు అదనపు వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయని అన్నారు.
వ్యవసాయాభివృద్ధికి కాళేశ్వరమే కారణం
కాళేశ్వరం నిర్మాణానికి మొత్తం రూ.94 వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని, అయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు.
2014కు ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదని ప్రశ్నించిన కేటీఆర్, కాళేశ్వరం వచ్చిన తర్వాతే సూర్యాపేట సహా అనేక జిల్లాలకు సాగునీరు అందిందన్నారు. రైతుల జీవన పరిస్థితి మెరుగుపడటంతో పాటు రాష్ట్రం వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో అగ్రస్థానానికి చేరిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, ఈ ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి శాశ్వత జీవనాధారంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.
