
నెల రోజుల్లో కృష్ణానగర్ వరదకు పరిష్కారం: హైడ్రా కమిషనర్
నగరం లో ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే వరద ముప్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే కృష్ణానగర్ ప్రాంతానికి ఈసారి ఉపశమనం కలిగేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మరో నెల రోజుల్లో కృష్ణానగర్ వరద సమస్యకు గణనీయమైన పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకుని కాలువల్లో పూడిక తొలగింపు పనులను ముమ్మరం చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి కృష్ణానగర్‌లో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను పూర్తిగా పరిశీలించి, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి భారీ వర్షాల సమయంలో వచ్చే నీటితో పాటు మట్టి కూడా పెద్దఎత్తున కాలువల్లో చేరిపోవడంతో ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని ఆయన వివరించారు. కాలువల్లో ఆరు నుంచి ఏడు అడుగుల మేర పూడిక పేరుకుపోవడంతో వర్షపు నీరు రహదారులపైకి వచ్చి ముంపు పరిస్థితులు సృష్టిస్తోందన్నారు. ప్రస్తుతం కాలువల లోతు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉండటంతో పూడికను పూర్తిగా తొలగించడం సవాలుగా మారిందని ఆయన చెప్పారు. అవసరమైన చోట్ల కాలువలపై ఉన్న స్లాబ్‌లను తొలగించి, పూర్తి స్థాయిలో పూడికను బయటకు తీసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. పనులు పూర్తయ్యాక అక్కడ బలమైన గ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు భంగం కలగకుండా చూస్తామని చెప్పారు.
పరిశీలనలో భాగంగా ఒకటి రెండు ఇళ్లు పూర్తిగా నాలాపై నిర్మించబడినట్లు గుర్తించినట్టు తెలిపారు. అయితే తొలగింపు అనివార్యమైతే మాత్రమే చర్యలు తీసుకుంటామని, ముందుగా నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇస్తామని పేర్కొన్నారు. 2021లో కాలువల్లో పూర్తిస్థాయిలో పూడిక తొలగింపు జరిగిందని, ఆ తర్వాత అంత స్థాయిలో పనులు జరగలేదని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు రంగనాథ్ తెలిపారు. గత ఏడాది వర్షాకాలంలో హైడ్రా అత్యవసర బృందాలు కొంత మేర పూడిక తొలగించినప్పటికీ పూర్తి స్థాయిలో సాధ్యపడలేదన్నారు. అందుకే ఈసారి వేసవికాలంలోనే పనులు ప్రారంభించి, వర్షాకాలం మొదలయ్యేలోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కృష్ణానగర్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రత్యామ్నాయ వరద కాలువ నిర్మాణం కోసం కూడా చర్యలు కొనసాగుతున్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ పరిశీలనలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్యతో పాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.
