Let's talk: editor@tmv.in
కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి

Gaddamidi Naveen
5 జులై, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఒక ఆదర్శప్రాయుడైన రాజనీతిజ్ఞుడని, ఆయన జీవితం, ప్రజాసేవ భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి కొనియాడారు.

శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన రోశయ్య 93వ జయంతి వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలనలో రోశయ్య ప్రతిపక్ష నాయకుడిగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. ప్రతి బడ్జెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిర్మాణాత్మక సూచనలు చేసేవారని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి, ప్రాధాన్యతలపై ఆయనకు స్పష్టమైన దృష్టి ఉండేదని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రోశయ్య అందించిన సూచనలు చిరస్మరణీయమని మంత్రి వివేక్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడుతూనే రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని రోశయ్య ఎప్పుడూ సూచించేవారని చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ నిరసనలు ఉన్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ విభేదాలతో చూడకూడదని భావించి స్వయంగా హాజరై అందరికీ ప్రోత్సాహం అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

పరిపాలనలో రోశయ్య అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారని మంత్రి కొనియాడారు. సచివాలయంలో అర్థరాత్రి వరకు పనిచేస్తూ ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకునేవారని తెలిపారు. చట్టబద్ధత, ప్రజా ప్రయోజనం, ప్రభుత్వ ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే ఏ ప్రతిపాదనకైనా ఆమోదం తెలిపేవారని చెప్పారు. తమ కుటుంబానికి రోశయ్యతో దశాబ్దాల అనుబంధం ఉందని మంత్రి వివేక్ వెల్లడించారు. తన తండ్రితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, తనతో పాటు సోదరుడు వినోద్‌ను కూడా ఎంతో ఆప్యాయంగా ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఆయన చూపిన ప్రేమ, మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మరువలేమని అన్నారు.

రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు, ప్రముఖులు, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
KonijetiRosaiahRosaiahKonijetiRosaiahJayantiRosaiahJayantiTelanganaAndhraPradeshHyderabadTeluguNewsBreakingNewsPoliticalNews
కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి - Tholi Paluku