Let's talk: editor@tmv.in
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

Gaddamidi Naveen
27 ఏప్రిల్, 2026

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ శాసనమండలికి గవర్నర్ కోటా కింద ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జి.ఓ. ఎంఎస్ నం.71 ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది.ఈ ఎమ్మెల్సీ స్థానాలకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా నామినేట్ చేశారు.

గత ఏడాది అక్టోబర్ 31న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్, నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు (ఏప్రిల్ 30 నాటికి) శాసనమండలి లేదా శాసనసభ సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ గడువు ముగియడానికి కేవలం నాలుగు రోజుల ముందు గవర్నర్ ఆమోదం లభించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయంపై ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు.

తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన కోదండరాంను ప్రభుత్వం 2024లోనే నామినేట్ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రవణ్ దాసోజు, కుర్రా సత్యనారాయణల నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో, వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాల కారణంగా ఈ నియామకాలు కొంతకాలం పెండింగ్‌లో ఉన్నాయి.

ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం గవర్నర్ నామినేట్ చేసిన ఈ సభ్యులు ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అయితే, ఈ నియామకాలు ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల తుది తీర్పుకు లోబడి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.