Let's talk: editor@tmv.in
మెట్రో ఫేజ్–2కు కిషన్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

మెట్రో ఫేజ్–2కు కిషన్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
16 జూన్, 2026

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2ను రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేయాల్సిన రూ. 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ లోన్ పంపిణీకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోత్సాహంతోనే కిషన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో ప్రాజెక్టును దెబ్బతీయాలని చూస్తున్నాయని సీఎం మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ చేసిన సహాయానికి ప్రతిఫలంగా కిషన్ రెడ్డి ఈ రకంగా ‘గురుదక్షిణ’ చెల్లించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మెట్రో ప్రాజెక్ట్ లోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీని, రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును ఐఆర్‌ఎఫ్‌సీకి చెల్లించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాము కేవలం 4 శాతం వడ్డీకే ఈ లోన్ సాధించామని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ, చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కానీ 8 నుంచి 11 శాతం వడ్డీ రేట్లతోనే రుణాలు తెచ్చుకున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ రుణంలో ఐఆర్‌ఎఫ్‌సీ కేవలం మధ్యవర్తి మాత్రమేనని, అసలు లోన్ జపాన్ దేశం అందిస్తోందని వివరించారు.

మే 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను, మే 21న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కిషన్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డికి పనులు ఇంత సులువుగా జరిగేలా సహకరిస్తే, తెలంగాణలో బీజేపీ మనుగడ కష్టమవుతుందని వారిద్దరికీ కిషన్ రెడ్డి చెప్పారు. ఈ రాజకీయ కుట్రల వల్లే కేంద్రం లోన్ విడుదల చేయడం లేదు. అందుకే నేను కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం (జూన్ 15) ఈ లోన్ పంపిణీకి ఆఖరి రోజని పేర్కొన్న సీఎం.. కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఈ రూ. 13,600 కోట్ల రుణాన్ని విడుదల చేయిస్తారా లేదా అని నిలదీశారు. ఐఆర్‌ఎఫ్‌సీ పెట్టిన నిబంధన మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ను కూడా గ్యారెంటర్ గా నిలబెట్టామని, ఆ నిబంధనను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.

రెండో దశ మెట్రోపై కేంద్రానికి రేవంత్ రెడ్డి సవాల్

తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఒక లేఖ సమర్పించానని సీఎం తెలిపారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులో 50 శాతం వాటా (ఈక్విటీ) భరించడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడుతుంటే, ఆ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. మొదటి దశ నిర్వహణ, రెండో దశ అభివృద్ధిపై కేంద్ర అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే తాను ఈ ప్రతిపాదన పెట్టాల్సి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (ఎన్ఓసీ) కోరినట్లు తెలిపారు. ప్రతి ఏటా రూ. 350-400 కోట్ల నష్టాల కారణంగా రెండో దశ విస్తరణ చేపట్టలేమని ఎల్ అండ్ టీ తేల్చిచెప్పడంతోనే, కేంద్ర నిపుణుల సలహాల మేరకు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయ కార్యాచరణ పూర్తి చేసిందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మెట్రో నిర్మిస్తే కేంద్రానికి, ప్రధాని మోడీకి, కిషన్ రెడ్డికి క్రెడిట్ దక్కదని, అందుకే కేంద్రం ఇప్పుడు ఇరకాటంలో పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటేనే రెండో దశను చేపట్టడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ విడుదల బాధ్యతను కిషన్ రెడ్డి తీసుకుంటారా? అలాగే రెండో దశలో కేంద్రం 50 శాతం ఈక్విటీ భాగస్వామిగా చేరుతుందా? లేక రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించుకోవడానికి ఎన్‌ఓసీ ఇస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్ర కేబినెట్ మంత్రి కాబట్టే తాను కిషన్ రెడ్డిని అడుగుతున్నానని చెప్పారు. తాను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మూడు సార్లు మాట్లాడానని, అయితే వారు చెప్పిన విషయాలను ఇప్పుడు బయటపెట్టదలచుకోలేదని, సమస్యను కిషన్ రెడ్డే పరిష్కరించాలని సీఎం డిమాండ్ చేశారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉందనడానికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టే నిదర్శనమన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కిషన్ రెడ్డి కలిసిన తర్వాత వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనల కదలిక మందగించిందని ఆరోపించారు. హైదరాబాద్ తో పోలిస్తే చాలా చిన్న నగరాలైన అహ్మదాబాద్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, కానీ హైదరాబాద్ మెట్రో పురోగతిని మాత్రం అడ్డుకుంటోందని విమర్శించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలు తన వద్ద ఉన్నాయని, కిషన్ రెడ్డికి వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీజేపీ చేస్తున్న డిమాండ్లపై ఆయన ఘాటుగా స్పందించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల జమ, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలను నెరవేర్చని ప్రధాని మోడీకి లేని నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ కోసం మిత్రపక్షాలపై ఆధారపడిందని, కానీ తెలంగాణలోని తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా ఆధారపడకుండా బలంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.