
ఖరీఫ్ 2026: సన్న రకం వరి సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో లాభదాయకమైన సాగును ప్రోత్సహించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌లో అధిక గిరాకీ, దిగుబడి ఉన్న సన్న రకం వరి రకాలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎంపిక చేసిన రకాలే సాగు..
గత ఏడాది 33 రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉండటం వల్ల మార్కెటింగ్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరికి బోనస్ అందలేదని మంత్రి గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించడానికి ఈ ఏడాది కేవలం రైతులు ఇష్టపడే, అధిక డిమాండ్ ఉన్న రకాలపైనే దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, డబ్ల్యూజీఎల్-962, జేజీఎల్-1798 వంటి రకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
రైతు ఉత్సవాలు
మే 4 నుంచి 9 వరకు నిర్వహించే “రైతు ఉత్సవాలు” కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన విత్తనాలను మే 15 నాటికి రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్‌తో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే రకాల విత్తనాలను సరఫరా చేయాలని సూచించారు. అవసరమైతే విత్తన కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా చెప్పారు.
కేంద్ర ఎంఎస్‌పీ విధానంపై ధ్వజం
ఇక సమావేశంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అంశంపై మంత్రి తుమ్మల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటిస్తున్నప్పటికీ, సేకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టివేస్తోందని విమర్శించారు. రైతులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌పీకి పంటను కొనుగోలు చేస్తోందని, దీనివల్ల ఏటా రూ.2,000 నుంచి రూ.3,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర బడ్జెట్‌పై పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఏ పంటకైతే ఎంఎస్‌పీ ప్రకటిస్తారో, ఆ పంట మొత్తాన్ని కేంద్రమే సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రం తుంగలో తొక్కిందని, శాస్త్రీయ పద్ధతిలో మద్దతు ధరను నిర్ణయించడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొని సాగు ప్రణాళికపై చర్చించారు. మొత్తంగా, ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు లాభదాయకమైన సాగు విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
