Let's talk: editor@tmv.in
ప్రధాని పై ఖర్గే వ్యాఖ్యలు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

ప్రధాని పై ఖర్గే వ్యాఖ్యలు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Dantu Vijaya Lakshmi Prasanna
23 ఏప్రిల్, 2026

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఖర్గే వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం కేవలం వ్యక్తిగత విమర్శ మాత్రమే కాదని, ఇది ప్రధానిపై విశ్వాసం ఉంచిన 147 కోట్ల మంది భారతీయ ప్రజలను అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఖర్గే వెంటనే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ అవి హుందాగా ఉండాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ భాషతో రాజకీయ ప్రమాణాలను దిగజారుస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీపై ఇలాంటి ద్వేషపూరిత విమర్శలు చేయడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్, రాహుల్ గాంధీ ప్రోద్బలం ఉందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ప్రధానిని నీచంగా విమర్శించారని, ఇది వారి కుసంస్కారాన్ని తెలియజేస్తుందని కిషన్ రెడ్డి 'ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నైతిక పతనాన్ని సూచిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మోడీని ఉగ్రవాది అనడం రాజకీయం కాదని, అది ఓటమి భయంతో పుట్టిన ఫ్రస్ట్రేషన్ అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన సమతుల్యతను కోల్పోయిందని, అందుకే ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిపై చేసిన దాడి కాదని, భారత ప్రజాస్వామ్య ఆత్మపై జరిగిన దాడి అని బండి సంజయ్ అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బండి సంజయ్ తన విమర్శల్లో గత చరిత్రను కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదుల కోసం కన్నీళ్లు కార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, మన సైనికుల పరాక్రమాన్ని శంకించిన పార్టీ కూడా అదేనని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల కాలంగా బుజ్జగింపు రాజకీయాల పేరుతో దేశాన్ని ఉగ్రవాద కోరల్లోకి నెట్టారని ఆరోపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే, ఆ పాత పద్ధతులు సాగక కాంగ్రెస్ నాయకులు ఇలా అసహనం వ్యక్తం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ నుండి 2019 బాలకోట్ వైమానిక దాడుల వరకు కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువుల భాషనే మాట్లాడిందని ఆయన విమర్శించారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే ,

చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేంద్ర ఏజెన్సీలను వాడుకుని ప్రతిపక్ష పార్టీలను మోడీ ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమిని విమర్శిస్తూ ప్రధాని మోడీని "ఉగ్రవాది" అని సంబోధించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడాన్ని ఉద్దేశించి ఆయన ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కలకలం సృష్టించాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నేత వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని ఉగ్రవాదితో పోల్చడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు, ఈ విమర్శల వెనుక రాహుల్ గాంధీ ప్రమేయం ఉందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ఈ "ఉగ్రవాది" వ్యాఖ్య రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.