
తెలంగాణ అభివృద్ధికి ఖమ్మం–వరంగల్–కరీంనగర్ కారిడార్ కీలకం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర వేగవంతమైన పట్టణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మెగా గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చివేసే పలు కీలక నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి ఖమ్మం–వరంగల్–కరీంనగర్ కారిడార్ వెన్నెముకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రాధాన్యత గల కారిడార్‌గా గుర్తించిన ఆయన దీనితో పాటు మహబూబ్‌నగర్–భూత్పూర్–జడ్చర్ల-కొత్తగూడెం–పాల్వంచ–సుజాతనగర్ కారిడార్ల అభివృద్ధికి తక్షణమే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్లు కేవలం రహదారులుగా మాత్రమే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు పట్టణాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనలో దీర్ఘకాలిక దృక్పథాన్ని పాటించాలని సీఎం సూచించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్ల (ఓఆర్ఆర్) నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తూనే ఏ ప్రాజెక్టు చేపట్టినా కనీసం వచ్చే 25 ఏళ్ల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వంటి అంశాలపై రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.
పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల అధికారిక అవసరాల కోసం ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) మాత్రమే అద్దెకు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ ఖర్చు తగ్గడమే కాకుండా కాలుష్య నివారణకు దోహదపడుతుందని ఆయన వివరించారు. ఇదే క్రమంలో పట్టణ పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు వంటి ఆధునిక పద్ధతులను అమలు చేయాలని సూచించారు.
అదేవిదంగా పర్యాటక, రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు నల్గొండ–యాదాద్రి మధ్య “టెంపుల్ కారిడార్”, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలను కలుపుతూ “టూరిజం కారిడార్” ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సమీక్షించారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వాటికి అవసరమైన రహదారి, నీటి వనరుల సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. మరో కీలక నిర్ణయంగా సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీలన్నింటినీ ఒకే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా విలీనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
