

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కీలక మైలురాయి.. స్వదేశీ సాంకేతికతతో 4 కెల్విన్ ఉష్ణోగ్రత సాధన
దేశీయ క్వాంటమ్ సాంకేతిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. అమరావతిలోని మేధా టవర్స్‌లో ఉన్న 'క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ' వద్ద తాము స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డెల్యూషన్ రిఫ్రిజిరేటర్ విజయవంతంగా 4 కెల్విన్ (-269°C) అతి తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసినట్లు అమరావతి క్వాంటమ్ వ్యాలీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
భారతదేశ క్వాంటమ్ సాంకేతిక ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు అమరావతిని ప్రధాన కేంద్రంగా మార్చాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ విజయం ఎంతో దోహదపడుతుంది. కట్రయోజెనిక్ ఇంజనీరింగ్ రంగంలో భారతదేశం సాధిస్తున్న సాంకేతిక పటిష్టతకు ఈ 4 కెల్విన్ మైలురాయి ఒక నిదర్శనమని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
‘మేడ్ ఇన్ అమరావతి’ విజన్
ఈ అద్భుత ప్రయాణం సెప్టెంబర్ 2025లో ప్రారంభమైంది. ఆ సమయంలో పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు అవసరమైన దాదాపు 85 శాతం భాగాలను భారతదేశంలోనే అభివృద్ధి చేసే అవకాశం ఉందని వారు ఒక నివేదికను సీఎంకు సమర్పించారు.
ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ‘మేడ్ ఇన్ అమరావతి ఫర్ ద వరల్డ్’ అనే నినాదంతో ఒక బలమైన 'దేశీయ క్వాంటమ్ హార్డ్‌వేర్ పర్యావరణ వ్యవస్థను' నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంస్థ క్యూబిట్ ఫోర్స్, క్యూబిటెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అధునాతన క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఉపయోగించే క్రయోజెనిక్ సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి పెడుతూ దేశీయంగా హార్డ్‌వేర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
జాతీయ స్థాయి పరిశోధనల వేదికగా మేధా టవర్స్
ఈ నిరంతర కృషి ఫలితంగా ఏప్రిల్ 2026లో అమరావతిలోని మేధా టవర్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు దేశంలోని స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యా సంస్థలు, జాతీయ ప్రయోగశాలలు, పారిశ్రామిక భాగస్వాములకు తాము తయారు చేసిన క్వాంటమ్ హార్డ్‌వేర్‌ను పరీక్షించుకోవడానికి, ధృవీకరించుకోవడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తాయి.
ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అనేది దేశీయ క్వాంటమ్ సాంకేతికతలకు ఒక జాతీయ స్థాయి పరీక్షా వేదికగా పనిచేస్తుంది. ఇక్కడ క్రయోజెనిక్ సిస్టమ్స్, వ్యాక్యూమ్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ప్రాసెసర్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి పలు విభాగాల సాంకేతికతలను సమగ్రంగా అభివృద్ధి చేసి, అనుసంధానించి పరీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రిసిషన్ పవర్ సప్లైస్, క్వాంటమ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ వంటి అనేక హార్డ్‌వేర్ భాగాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు.
భవిష్యత్తు లక్ష్యాలు
4 కెల్విన్ వద్ద స్థిరమైన ఉష్ణోగ్రతను సాధించడం ద్వారా సూపర్ కండక్టింగ్ పరికరాలు, క్వాంటమ్ సెన్సార్లు, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్, సింగిల్-ఫోటాన్ డిటెక్టర్లు వంటి క్లిష్టమైన భాగాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. వీటిని క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ టెక్నాలజీలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లకు అవసరమైన అత్యంత అల్పమైన 'మిల్లీకెల్విన్' ఉష్ణోగ్రతల వైపు తీసుకెళ్లనున్నారు. తదుపరి దశలో క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్టింగ్ , ప్రాసెసర్ డెవలప్‌మెంట్‌కు ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఈ ప్రయోగాల విజయానికి అండగా నిలిచిన నేషనల్ క్వాంటమ్ మిషన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
