




తుంగభద్ర జలాలపై మూడు రాష్ట్రాల సీఎంల కీలక చర్చలు!
కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ చరిత్రాత్మక వేడుకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ. రేవంత్ రెడ్డి (తెలంగాణ),ఎన్. చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), డీ.కె. శివకుమార్(కర్ణాటక సీఎం)లతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తుంగభద్రప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత డీ.కె. శివకుమార్ మాట్లాడుతూ, ముగ్గురు సీఎంలు కలిసి ఐక్య౦గా పనిచేసి చరిత్ర సృష్టిస్తామన్నారు.
సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి - రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతరాష్ట్ర జల వివాదాలను పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసమే తామంతా ఒకే వేదికపైకి వచ్చామని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం కృష్ణా, గోదావరి, తుంగభద్ర జలాల్లో ఉన్న వివాదాలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద తెలంగాణకు కేటాయించిన నీటి హక్కులను ముఖ్యమంత్రి ఈ వేదికపై బలంగా వినిపించారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు (మహబూబ్‌నగర్) ప్రాంతాల పరిధిలోని ఆర్డీఎస్ కింద తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీల సాగునీటిలో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకో గలుగుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో భారీగా మట్టి, పూడిక పేరుకుపోవడం, నీళ్ల తరలింపులో ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యల కారణంగా మిగిలిన 10 టీఎంసీల నీరు తెలంగాణకు అందడం లేదని వివరించారు. ఈ నీటి కొరత వల్ల గద్వాల్, అలంపూర్ పరిధిలోని లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తమకు కేటాయించిన పూర్తి స్థాయి 15 టీఎంసీల నీటిని వాడుకునేలా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా కోరారు.
నీటి సమస్యలపై సుదీర్ఘ చర్చలు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇచ్చిన ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తాను కలిసి బళ్లారి వేదికగా, తుంగభద్ర నది ఒడ్డున ఈ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు కేంద్ర మంత్రి పాటిల్ ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం, నీటి నిర్వహణ లోపాల వల్ల పొలాలను తడపాల్సిన విలువైన కృష్ణా, తుంగభద్ర జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, ఈ వృథాను అరికట్టి ప్రతి చుక్కనూ రైతులకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన గుర్తుచేశారు.
ఈ నీటి సమస్య ఈనాటిది కాదని, దాదాపు మూడు తరాలుగా ఈ ప్రాంత ప్రజలను వేధిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ యొక్క 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా ఈ మూడు తరాల సమస్యకు తెరపడబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక పునరుద్ధరణ పనుల వల్ల కేవలం తెలంగాణకే కాకుండా, కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కర్నూలు జిల్లాలతో పాటు పాలమూరు ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని కొనియాడారు.
రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా, రైతుల బాగు కోసమే తుంగభద్ర నది సాక్షిగా జరుగుతున్న ఈ చర్చలు భారత జలవనరుల చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమం, రైతుల మేలే ముఖ్యం
తుంగభద్ర ప్రాజెక్టు వెనుక ఉన్న చారిత్రాత్మక నేపథ్యాన్నిఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. నాడు ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం నవాబు కలిసి ఉమ్మడిగా ఈ తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారని చెప్పారు. కేవలం రాజ్యాలను ఆక్రమించుకునే ఆనాటి రాజులే ప్రజా సంక్షేమం, రైతుల మేలు కోసం అంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు, నేడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా అంతకంటే బాధ్యతగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో మూడు రాష్ట్రాల మధ్య ఉన్న సాగునీటి సమస్యలన్నింటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కేంద్రం సానుకూలంగా స్పందించి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రైతాంగాన్ని ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
నదుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్: సీఎం చంద్రబాబు
తుంగభద్ర ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర డ్యామ్ మూడు రాష్ట్రాల రైతులకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించే జీవనాడిగా నిలుస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చొరవతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై సమావేశమవడం చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు అన్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలను మాత్రమే కాకుండా, రాష్ట్రాల నదులను కూడా అనుసంధానం చేసే దిశగా కేంద్ర మంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
తుంగభద్ర నది పవిత్రతను ప్రస్తావిస్తూ "తుంగా పానం – గంగా స్నానం" అనే సామెత ప్రజల్లో ప్రసిద్ధి చెందిందని గుర్తు చేశారు. తుంగభద్ర జలాలు ఆధ్యాత్మికంగా, వ్యవసాయపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
గేట్ కొట్టుకుపోయినా నీరు వృథా కాకుండా చర్యలు
2024లో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేట్ కొట్టుకుపోయిన సమయంలో పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు తెలిపారు. నిపుణుడు కన్నయ్య నాయుడు సహకారంతో స్టాప్‌లాక్ గేట్‌ను ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టినట్లు చెప్పారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి పనిచేసి ప్రస్తుతం 33 క్రస్ట్ గేట్లను పూర్తిగా పునరుద్ధరించాయని వెల్లడించారు. ఈ పునరుద్ధరణ ద్వారా తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యం మరింత పెరిగి రైతుల ప్రయోజనాలు కాపాడబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నదుల అనుసంధానం దేశ భవిష్యత్తుకు కీలకం
భారత్ అభివృద్ధి ప్రయాణంలో నదుల అనుసంధానం అత్యంత కీలకమని చంద్రబాబు నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వన్ నేషన్–వన్ గ్రిడ్, టెలికాం నెట్‌వర్క్, జాతీయ రహదారి వ్యవస్థ వంటి కార్యక్రమాలు దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.
దేశంలో గంగా–కావేరి నదులను అనుసంధానం చేయగలిగితే భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కెన్–బేత్వా ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం విజయవంతంగా అమలు అవుతోందని గుర్తు చేశారు.
అదేవిధంగా గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.
నీటి కొరతను ఎదుర్కోవాలంటే సమన్వయమే మార్గం
ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు రావడం లేదని చంద్రబాబు తెలిపారు. దీంతో ప్రస్తుత ఏడాదిలో నీటి వినియోగంలో అత్యంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
ముందుగా ప్రతి రాష్ట్రం అంతర్గతంగా నదుల అనుసంధానం చేపట్టాలని, అనంతరం రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానం అమలు చేస్తే దేశవ్యాప్తంగా నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు.
చరిత్రలో నిలిచే సమావేశం
తుంగభద్ర నదీ తీరానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అఖండ విజయనగర సామ్రాజ్యానికి, హంపీ నగరానికి ఈ నది ఒక సహజ రక్షణ కవచంగా నిలిచిందని గుర్తుచేశారు. జోగులాంబ అమ్మవారి క్షేత్రం, హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఈ పవిత్ర నదీతీరానే వెలిశాయని పేర్కొన్నారు.
1983లో అప్పటి ప్రధానమంత్రి, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీరు కేటాయించే నిర్ణయం తీసుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నై నగరానికి 15 టీఎంసీల తాగునీరు అందించే నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పారు.
ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కలిసి రైతుల ప్రయోజనాలపై చర్చించడం దక్షిణ భారత జలవనరుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
తాము రాష్ట్రాలుగా వేర్వేరుగా ఉన్నప్పటికీ దేశంగా ఒక్కటేనని పేర్కొన్న చంద్రబాబు, రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసి రైతుల సంక్షేమాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం భవిష్యత్తులో అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
