
హరీష్ రావు ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ నేతల కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని, ఆ పార్టీ మునిగిపోయే పడవలా మారిందని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల సభ సాక్షిగా బీఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వస్తుంటే, అదే సమయంలో మాజీమంత్రి హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీకి వెళ్లడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా హరీష్ రావు ఈ నిర్ణయానికి దూరంగా ఉన్నారని, జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించలేదని పేర్కొన్నారు.కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన సందర్భాల్లో కూడా హరీష్ రావు పాల్గొనలేదని, జగిత్యాల పర్యటనలో ఆయనను ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కేసీఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పటికీ హరీష్ రావు వెళ్లకపోవడం పార్టీలో అంతర్గత విభేదాలను సూచిస్తోందని చామల కిరణ్ రెడ్డి గుర్తుచేశారు.
హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. జగిత్యాల సభకు రాకుండా ఢిల్లీలో హరీష్ రావు ఏ పార్టీ నేతలను కలుస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ చాలా కాలం తర్వాత ప్రజల్లోకి రావడం, పార్టీలో నాయకత్వ లోపాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని, మొదటి నుంచే ఆమె హరీష్ రావు తీరుపై అసహనంతో ఉన్నారని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందని, పార్టీ రెండు భాగాలుగా చీలే ప్రమాదం ఉందని ఆరోపించారు.
అలాగే జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని, కార్యకర్తల్లో కూడా దీనిపై వ్యతిరేకత ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మొత్తం మీద, బీఆర్ఎస్‌లో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందని వారు పేర్కొన్నారు.
