
రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి కేజ్రీవాల్ నివాళి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కోర్టు విచారణను బహిష్కరించనున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ ప్రతిపక్ష నాయకురాలు ఆతిషి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశ న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని, గతంలో కోర్టుల ద్వారా బెయిల్ కూడా లభించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన కొన్ని పరిస్థితుల వల్ల ‘సత్యాగ్రహం’ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయాలను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మకు రాసిన లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు. బాపు చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తూ, ఈ కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ కోర్టులో నేను వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరు కావడం లేదని నిర్ణయించుకున్నాను. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా, తగిన సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు నాకు ఉందని కేజ్రీవాల్ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి ముందు హాజరు కాను: సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ముందు ఇకపై తాను హాజరు కావడం లేదని ప్రకటించారు. ఇంతకు ఒక రోజు ముందే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ తన కేసులో వ్యక్తిగతంగా హాజరు కావడం మాత్రమే కాకుండా, న్యాయవాదిని కూడా నియమించబోనని ప్రకటించారు. న్యాయమూర్తికి రాసిన లేఖలో సిసోడియా నా తరఫున ఎలాంటి న్యాయవాది కూడా హాజరుకారు. న్యాయం లభిస్తుందనే నమ్మకం లేదు. ఇప్పుడు సత్యాగ్రహమే మార్గమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ లేఖలో ప్రస్తావించిన అంశాలతో తాను ఏకీభవిస్తున్నానని, అవి తనకూ ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యాగ్రహ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.
తన లేఖలో సిసోడియా కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. న్యాయమూర్తి కొన్ని న్యాయవాదుల సంస్థ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, ఆ సంస్థను ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా భావిస్తారని పేర్కొన్నారు. అలాగే, న్యాయమూర్తి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్స్‌లో పనిచేస్తున్నారని, అదే ప్రభుత్వ తరఫున తనపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో సంబంధం ఉందనే భావన కలుగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు నిష్పక్షపాత న్యాయం లభిస్తుందనే నమ్మకం లేకుండా విచారణలో పాల్గొనడం తన మనస్సాక్షికి విరుద్ధమని సిసోడియా తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టు విచారణలో పాల్గొనబోనని స్పష్టం చేశారు.
