
జడ్జిపై కేజ్రీవాల్ అభ్యంతరం..అఫిడవిట్ దాఖలు
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, లిక్కర్ పాలసీ కేసులో తనపై నమోదైన కేసు విచారణకు సంబంధించి కీలక అభ్యర్థన చేశారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మకు ‘ కేసును వాదించినందుకు గాను ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటూ తన అదనపు అఫిడవిట్‌ను రికార్డులోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే న్యాయమూర్తి శర్మా ఆ అఫిడవిట్‌ను రికార్డులోకి తీసుకోవాలని కోర్టు రిజిస్ట్రీకి ఆదేశించినప్పటికీ, ఇప్పటికే తనపై ఉన్న రిక్యూసల్ (విచారణ నుంచి తప్పుకోవాలని చేసిన అభ్యర్థన) పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో కేసును మళ్లీ తెరవడం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సీబీఐ తరఫున వాదిస్తున్న సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంస్థ తమ లిఖిత పూర్వక వాదనలు కోర్టులో సమర్పిస్తుందని తెలిపారు. కేజ్రీవాల్ అభ్యర్థనపై ఆ వాదనల ప్రతిని ఆయనకు అందించాలని కోర్టు సీబీఐకి సూచించింది.
అఫిడవిట్‌లో కేజ్రీవాల్ ఆరోపణలు
ఏప్రిల్ 14 తేదీతో సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో, న్యాయమూర్తి శర్మా పిల్లలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన న్యాయవాదుల ప్యానెల్‌లో ఉన్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ తరఫున వాదిస్తున్న సాలిసిటర్ జనరల్ ద్వారా వారికి పని కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో లభించిన సమాచారం, అలాగే ఆర్‌టీఐ ద్వారా వచ్చిన వివరాల ఆధారంగా న్యాయమూర్తి కుమారుడికి భారీగా కేసులు కేటాయించారని కేజ్రీవాల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023లో 2,487 కేసులు, 2024లో 1,784 కేసులు, 2025లో 1,633 కేసులు ఆయన కుమారుడికి ఇచ్చారని ఆ వివరాల్లో ఉందని తెలిపారు. ఈ విషయాలు తనకు ముందుగా తెలియలేదని, రిక్యూసల్ పిటిషన్ వేసిన తర్వాతే తెలుసుకున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్‌లో ఉండటం కేవలం గౌరవనీయమైన పదవి మాత్రమే కాదని, దానికి కోర్టు హాజరులు, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.
మరిన్ని అభ్యంతరాలు
ఈ కేసును న్యాయమూర్తి శర్మా విచారించడంపై కేజ్రీవాల్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌కు ఆమె ఉపశమనం కలిగించలేదని, అలాగే ఇతర నిందితులు అయిన మనీశ్ సిసోడియా, కవిత బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తనకు న్యాయపరమైన తటస్థత కనిపించకపోవచ్చనే భయం ఉందని చెప్పారు. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్ వ్యక్తం చేసిన అనుమానాలు ఆధారరహితమని, ఇవి ‘పరిపక్వత లేని మనస్సులో కలిగే సందేహాలు’ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
కేసు నేపథ్యం
ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా తదితరులకు విముక్తి కల్పించింది. సీబీఐ దాఖలు చేసిన కేసు న్యాయపరమైన పరిశీలనలో నిలబడలేదని పేర్కొంది. దీనిపై సీబీఐ హైకోర్టులో సవాలు చేసింది. ఇక ఈ రిక్యూసల్ పిటిషన్‌పై హైకోర్టు ఏప్రిల్ 13న తీర్పును రిజర్వ్ చేసింది.
