

నేడు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ
జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ మోతె రోడ్డు పక్కన గల భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. నేడు 'ప్రజా ఆశీర్వాద సభ' పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు ఏడాది కాలం తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కదం తొక్కాలని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభలోనే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అదే విధంగా జీవన్ రెడ్డి పార్టీలో చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని నేతలు అభిప్రాయపడ్డారు.
దాదాపు ఏడాది తర్వాత ఆయన ఒక ప్రజా సభలో మాట్లాడనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగిత్యాల నుంచే మళ్లీ పార్టీ పూర్వ వైభవం సాధించడానికి అలాగే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ప్రజల ఆశీర్వాదమే కీలకమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సభ విజయవంతం కోసం స్థానిక నాయకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాజరుకానున్న ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనుంది. ఈ సభ బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.
లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని దాదాపు మూడు లక్షల నీటి బాటిల్స్, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సాయంత్రం 5:30 గంటలకు సభకు హాజరవుతారని, ఎండ తగ్గిన తర్వాతే సభ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం కోసం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలని నేతలు ఆశిస్తున్నారు.
2023 ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి, కేసీఆర్ రాజకీయంగా మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ఆయన పూర్తిస్థాయిలో ప్రజల మధ్యకు రాకపోవడం, అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నా, గతంలో లాగా యాక్టివ్‌గా లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నాయకుడి రాక కోసం వేచి చూస్తున్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రావాలని క్షేత్రస్థాయి నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఎప్పుడు గర్జిస్తారు అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. ఇటు కేసీఆర్ పంచ్‌ల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈ సభలో ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
