Let's talk: editor@tmv.in
హిట్లర్‌గా మారతానని ‘కేసీఆర్’ కూడా అన్నారు: మంత్రి శ్రీధర్ బాబు

హిట్లర్‌గా మారతానని ‘కేసీఆర్’ కూడా అన్నారు: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
9 జూన్, 2026

‘హైడ్రా’ కు సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలపై విపక్ష బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే వేగం, ఖచ్చితత్వాన్ని ఉద్దేశించి మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించారని, అంతే తప్ప నాజీ నియంత హిట్లర్ యొక్క హింసాత్మక భావజాలాన్ని సమర్థించలేదని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. భూ కబ్జాదారులపై చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తామనే ఉద్దేశంతోనే సీఎం అలా అన్నారని వివరించారు. బీఆర్‌ఎస్ నాయకులు కేవలం ‘హిట్లర్’ అనే పదాన్ని పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పాత వీడియోను ప్రదర్శించిన మంత్రి

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) మాట్లాడిన ఒక వీడియో క్లిప్‌ను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఆ వీడియోలో కేసీఆర్.. నేను హిట్లర్ కావాలనుకున్నాను. ప్రభుత్వ సొమ్మును ఎవరైనా ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తే.. మేము హిట్లర్ లాగే కాదు, అతని తాత లాగా ప్రవర్తిస్తాం అని మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి.

ఈ వీడియోను చూపిస్తూ.. మరి నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిట్లర్ భావజాలాన్ని అమలు చేశారా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నడూ సెక్రటేరియట్‌కు రాలేదని, ఆయన క్యాంప్ ఆఫీస్ కనీసం సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా ఉండేది కాదని గుర్తుచేశారు. ఆ నాడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అది ప్రజాస్వామ్య పాలన అనిపించుకుంటుందా? అని నిలదీశారు.

హైడ్రా చట్టబద్ధంగానే పనిచేస్తోంది

హైడ్రా పూర్తిగా చట్ట పరిధిలోనే పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. నగరంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జాదారుల బారి నుంచి రక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు. కబ్జాలు తొలగిపోతుండటంతో ఆయా నీటి వనరుల పరిసర ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలు హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నారని తెలిపారు. హైడ్రా చర్యల వల్ల కబ్జాదారుల గుండెల్లో వణుకు పుడుతుంటే, కొంతమంది మొసలి కన్నీరు కారుస్తున్నారు. భూములు కబ్జాల నుంచి విముక్తి పొందుతుంటే కేటీఆర్‌కు ఎందుకు అంత బాధ కలుగుతోంది? అని ప్రశ్నించారు. నాడు కబ్జాలు చేసిన వారు భయపడుతుంటే, నేడు కేటీఆర్ గాంధీజీ, అంబేద్కర్ సిద్ధాంతాల గురించి మాట్లాడటం శతాబ్దపు అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.

రాజకీయ వివాదానికి కారణమైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

శనివారం బెంగళూరులో జరిగిన ఒక మీడియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. నగరంలో చెరువులు, నాలాలు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతుండటం, ధనికులు తమ ఫార్మ్‌హౌస్‌ల కోసం నీటి వనరులను ఆక్రమించి డ్రైనేజీలను వాటిలోకి వదులుతుండటాన్ని గమనించి తాను ‘హైడ్రా’ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం 'హైడ్రా'. ఎవరినైనా ఖతం చేయగల అతని ప్రధాన బృందాన్ని హైడ్రా అని పిలిచేవారు. అందుకే నేను హిట్లర్ నుంచి ప్రేరణ పొంది, ఈ టాస్క్‌ఫోర్స్‌కు 'హైడ్రా' అని పేరు పెట్టాను అని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయనలోని నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వాన్ని దేశం మొత్తానికి బయటపెట్టాయని విమర్శించిన సంగతి తెలిసిందే.