Let's talk: editor@tmv.in
అమీర్‌పేట్ అగ్నిప్రమాద బాధితులకు కవిత పరామర్శ
అమీర్‌పేట్ అగ్నిప్రమాద బాధితులకు కవిత పరామర్శ

అమీర్‌పేట్ అగ్నిప్రమాద బాధితులకు కవిత పరామర్శ

Gaddamidi Naveen
6 జూన్, 2026

అమీర్‌పేట్ మైత్రివనం ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తాము ముందుగానే హెచ్చరించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఈ సందర్భంగా బాధితులు ఆమెకు వివరించారు.

అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగింది కాదని అన్నారు. కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న మెస్ కారణంగా గతంలోనూ షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ప్రమాదకర పరిస్థితులపై గత మూడు నెలలుగా అధికారులకు చెబుతున్నా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె మండిపడ్డారు. ఈ ప్రమాదం వల్ల దాదాపు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన గంటంబావు వరకు కూడా ఫైరింజన్లు రాకపోవడం దారుణమని, ప్రభుత్వం దీనిపై సీరియస్ గా ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఫైరింజన్లు సకాలంలో వచ్చి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు.

ప్రమాదానికి గురైన దుకాణాలన్నింటికీ ఎన్ఓసీలు ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆమె కోరారు. గతంలో హైడ్రా అధికారులు సైతం ఇక్కడ ఇన్ స్పెక్షన్ చేశారని బాధితులు చెబుతున్నారన్నారు. ఈ ఏడాది వేసవిలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యల వల్ల మంచి ఫలితాలు వచ్చినా, ఈ అంశంపై ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రద్దీగా ఉండే బిల్డింగ్‌ల వద్ద నిరంతరం తనిఖీలు చేపట్టాలని కవిత స్పష్టం చేశారు.