

కవిత కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) అని పేరు పెట్టిన ఆమె, మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ జెండాను, ఎజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులు
కవిత శనివారం ఉదయం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద 1969 తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టిందని, కానీ పేరు మార్పు తర్వాత ఆ పార్టీ తన అసలు ఆత్మను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కోల్పోయిందని విమర్శించారు. మేము పార్టీని వీడలేదు, మమ్మల్ని బహిష్కరించారు. నా రక్తంలో తెలంగాణ తనం ఉంది. మా ఆశయాల సాధన కోసం పాత పార్టీ ఉన్నా లేకపోయినా, కుటుంబం తోడుగా ఉన్నా లేకపోయినా.. తెలంగాణ మట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. సొంత తండ్రి నాయకత్వంలోని బీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు మనమందరం చూసిన కేసీఆర్ ఇప్పుడు లేరు. ప్రస్తుత కేసీఆర్ ఒక ఆత్మలేని యాంత్రిక బొమ్మ. ఆయన నక్కల గుంపు మధ్య బందీ అయ్యారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, ప్రజల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. ఒకవేళ ఆయన పాత కేసీఆర్ అయి ఉంటే, తాను ఆయన పాదాలకు నమస్కరించేదాన్నని, కానీ ఇప్పుడు ఆయనలో మానవత్వం లేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతలు, భారీ వర్షాలతో పంటలు మునిగిపోవడం, చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందడం వంటి ఘటనలపై కేసీఆర్ స్పందించలేదని ఆమె అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఆమె ప్రస్తావిస్తూ, తెలంగాణపై నిజమైన ప్రేమ ఉంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేసేవారని అన్నారు. కానీ జాతీయ రాజకీయాల కోసం ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆరోపించారు. అవినీతి చేసిన వారిని మాత్రం ఆయన వద్ద ఉంచుకున్నారు, అని ఆమె అన్నారు.
అన్న కేటీఆర్‌పై విమర్శలు
తన సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కవిత విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌కు రాజకీయ పరిపక్వత లేదని, ప్రజలు తప్పు చేశారంటూ ఆయన మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రజలు అధికారం ఇవ్వకపోతే వారు తప్పు చేసినట్లా? ఒక తల్లిగా నా కొడుకు తప్పు చేస్తే వాడిని వదిలేస్తుందా? జాగ్రత్తగా చూసుకోనా? అని ప్రశ్నిస్తూ, కేసీఆర్ కుటుంబం ప్రజల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఐదు ప్రధాన వాగ్దానాలు
రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కవిత, ‘పాంచజన్యం’ పేరుతో ఐదు కీలక హామీలను ప్రకటించారు.
• రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఉచితంగా విద్య, వైద్య సేవలు.
• రైతు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్.
• ఒకే నోటిఫికేషన్‌తో యువతకు 4 లక్షల ఉద్యోగాల భర్తీ
• సామాజిక తెలంగాణ లక్ష్యంతో బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు.
• నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్ర సాధన ఆశయాలను నిజం చేయడం.
కాంగ్రెస్, బీజేపీలపై దాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిట్లర్ తో పోల్చిన కవిత, రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలు, సామాజిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు, పోలీసు కస్టడీలో దళిత యువకుడి మృతి, విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీపై స్పందిస్తూ.. ఆ పార్టీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారు అనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలకు సిగ్గు ఉంటే, ఆంధ్రకు బదిలీ చేసిన ఐదు గ్రామాలను తిరిగి తీసుకురావాలని సవాల్ విసిరారు. అలాగే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ విభజనను దేశ విభజనతో పోల్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఉండి...చిన్న సార్ ను సీఎం చేయాలన్నది బీఆర్ఎస్ అజెండా అని చెప్పారు. ఇక సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ అజెండా అని కవిత అన్నారు. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు సేన సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అమ్మగా పరిపాలన అందిస్తా..
తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత చెప్పారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందన్నారు. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందన్నారు. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలతో సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ పేరుపై ఈసీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం
నూతన రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత, ఈ పేరుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తుది ధృవీకరణ కోసం వేచి చూస్తున్నట్లు ఆమె తెలిపారు. వెనుకబడిన వర్గల అభ్యున్నతి కోసం తన పార్టీ పోరాడుతుందని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. 95 శాతం ప్రాంతీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తామని, గత 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కానీ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కానీ యువత, రైతుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆమె ఆరోపించారు. తమ జీవితకాలమంతా టీఆర్ఎస్ అనే పేరు కోసమే పనిచేశామని, 20 ఏళ్ల రక్తం, చెమటతో ఆ పేరును విజయవంతం చేశామని కవిత గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా, ఆశయాలు నెరవేరలేదన్నారు. అందుకే మళ్ళీ ప్రాంతీయ పార్టీ అవసరమైందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తన బంధువులైన హరీష్ రావు, సంతోష్ కుమార్‌లను విమర్శించినందుకు గాను 2025 సెప్టెంబర్‌లో కవితను బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి తెలంగాణ జాగృతి వేదికగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆమె, ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ పార్టీతో రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ పేరును మార్చడం వల్ల పార్టీ తన తల్లి వంటి స్వభావాన్ని కోల్పోయిందని కవిత ఆరోపించారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో బీఆర్‌ఎస్ పునాదులను కదిలించడంతో పాటు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
